‘డబుల్’ కేటాయింపులపై ‘ఫుల్’అసంతృప్తి..!

by  |
‘డబుల్’ కేటాయింపులపై ‘ఫుల్’అసంతృప్తి..!
X

దిశ‌, అందోల్: నిరుపేదలు, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఇందులో భాగంగానే అందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో 324 ఇండ్లు పూర్తికావడంతో వాటిని అర్హులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మున్సిపాలిటీలో మొత్తంగా 20 వార్డులుండగా ఈ 320 ఇండ్లను కేవలం 5 వార్డులకు మాత్రమే కేటాయించడంతో మిగతా 15 వార్డుల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో మూడు చోట్ల 576 ఇండ్లు మంజూర‌య్యాయి. ఇందులో అందోల్‌లోని గూడెం వ‌ద్ద 216, వ‌డ్డెర కాల‌నీ వ‌ద్ద 108 ఇండ్లు, మొత్తం 324 ఇండ్ల‌ నిర్మాణాలు పూర్త‌యి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటి కోసం 4, 5‌, 6, 7, 8 వార్డుల ప‌రిధిలోని వారు దర‌ఖాస్తు చేసుకోవాల‌ని తహసీల్దార్ ప్రభులు ప్రకటన విడుదల చేశారు.

నిర్మాణంలో మరికొన్ని..

అందోల్-జోగిపేట మున్సిపాలిటీ ప‌రిధిలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో అందోల్‌లోని 324 ఇండ్లు పూర్తయ్యాయి. జోగిపేట‌లో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వాటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలోని 20 వార్డులుండ‌గా, 5 వార్డుల ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు 324 డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను పొందేందుకు అర్హులుగా అధికారులు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల మిగ‌తా 15 వార్డుల ప్ర‌జ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అందోల్‌లోని 5 వార్డులకు 324 ఇండ్లు కేటాయించి, జోగిపేట‌లోని 15 వార్డులకు 252 ఇండ్లు మాత్రమే కేటాయించడం‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందోలు-జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించిన నిధులను వార్డుల వారీగా స‌మానంగా కేటాయించే అధికారులు, డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల విష‌‌యంలో స‌మ‌న్యాయం చేయడం లేదని, మున్సిపాలిటీని విభ‌జించి పాలించ‌డం స‌రైన విధానం కాద‌ని జోగిపేట‌ కౌన్సిల‌ర్లు, ప్రజలు అంటున్నారు. తమ వార్డుల్లోని వారికి ఇండ్లు ఇప్పించలేకపోతున్నామని పలువురు వార్డు కౌన్సిలర్లు ఆందోళన చెందుతున్నారు.

15వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..

అందోల్‌లో పూర్త‌యిన 324 డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 4, 5, 6, 7, 8 వార్డుల ప‌రిధిలోని అర్హులైన వారి నుంచి ఈ నెల 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్టు తహసీల్దార్ ప్ర‌భులు తెలిపారు. అందోల్‌లోని బాలుర ఉన్న‌త పాఠశాల‌లో కౌంట‌ర్-1 వ‌ద్ద 5, 8 వార్డుల వారు, కౌంట‌ర్ -2 వ‌ద్ద 4 ,6, 7 వార్డుల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంటల వ‌ర‌కు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఆహ‌ర భ‌ద్ర‌త కార్డు క‌లిగి ఉండి, సొంత ఇల్లు లేని వారు ఇందుకు అర్హులని వెల్లడించారు.

ఎన్నికల సమయంలోనే ఫారాలు పంపిణీ ?

మున్సిప‌ల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన వారు అభ్య‌ర్థుల‌కు ఓటేస్తే డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను కేటాయిస్తామ‌ని చెప్పారు. అందుకు సంబంధించిన ఫారాలను అప్పుడే పంపిణీ చేశారు. ఆయా వార్డుల్లో సుమారుగా 1200 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ఫారాలు పంపిణీ చేసిన‌ట్టు స‌మాచారం. గెలుపొందిన వారిని ఈ దరఖాస్తు ఫారాల పంపిణీ తలనొప్పిగా మారింది. అందోల్‌లోని 4,5,6,7,8 వార్డుల‌కు చెందిన ప్ర‌జ‌లు మాత్రం కాస్త సంతృప్తిగా ఉండ‌గా, జోగిపేట‌లోని 15 వార్డుల్లోని ప్ర‌జ‌లు, కౌన్సిల‌ర్లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. తమ వార్డుల్లో సైతం అర్హులైన వారు ఉన్నారని వారి పరిస్థితి ఏంటని కౌన్సిలర్లు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.


Next Story

Most Viewed