సంస్థల నడుమ ఆధిపత్యం.. నిలిచిన 300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి

by  |
Visakha Steel Plant
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఆక్సిజన్ కొరతను సృష్టించింది. దేశ వ్యాప్తంగా కేవలం ఆక్సిజన్ అందకనే రోజుకు వందల మందిని మృత్యువు కబలిస్తోంది. ఈ తరుణంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఉన్నా రెండు సంస్థల మధ్య ఉన్న ఆధిపత్యం కారణంగా నిరుపయోగంగా మారింది. అంటే రోజుకు 33 వేల ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా ఆగిపోయినట్లు అయింది.

విశాఖ ఉక్కు కర్మాగారంలో 2010లో ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ లిక్విడే సంస్థ పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం 850 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ( ఏఎస్పీ)లను బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీఓఓ) ప్రాతిపాదికన నిర్మించారు. వీటిల్లో ప్రయోగాత్మకంగా ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ఆ తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి, ఎయిర్ లిక్విడే సంస్థ మధ్య ఆర్థిక పరమైన విభేదాలు తలెత్తాయి. ఈ రెండు సంస్థలు పంతానికి పోవడంతో అప్పటి నుంచి ఆ ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోయింది.

కాగా, ఎయిర్‌ లిక్విడే సంస్థ ప్లాంటును అందుబాటులోకి తెస్తే వైద్య అవసరాలకు ఉపయోగపడే 300 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను రోజూ ఉత్పత్తి చేయొచ్చని అంచనా. ఒక టన్ను ఆక్సిజన్‌ పరిమాణం 770 క్యూబిక్‌ మీటర్లు. దాంతో 110 సిలిండర్లను నింపుతారు. ఒక్కో సిలిండర్లో ఏడు క్యూబిక్‌ మీటర్ల ప్రాణవాయువు ఉంటుంది. ఆ లెక్కన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న ఎయిర్‌ లిక్విడే ప్లాంటు నుంచి రోజుకు 33 వేల ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావచ్చు. కేంద్ర మంత్రిత్వశాఖలు, ప్లాంట్ ఉన్నతాధికారులు తలచుకుంటే ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.



Next Story

Most Viewed