బీజేపీ బీ‘హార్‌’ జాయేగా క్యా!

by  |
బీజేపీ బీ‘హార్‌’ జాయేగా క్యా!
X

250 మంది ఎంపీలు, 11 మంది సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రధాని సర్వశక్తులొడ్డి చివర వరకు హోరాహోరీగా తలపడినా కేజ్రీ‘వాల్’ను కమలం బ్రేక్ చేయలేకపోయింది. గతం కంటే ఎక్కువగానే ఓటింగ్ పొంది, 8 స్థానాలతో ప్రతిపక్షపాత్రకు బీజేపీ పరిమితమైపోయింది. ఇక ఈ ఏడాది జరిగే నెక్స్ట్ బిగ్ ఎలక్షన్ ‘బీహార్’పై బీజేపీ ఫోకస్ ఉంటుందని కమలనాథులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఢిల్లీలో ఓటమి చవిచూసిన కమలనాథులు బీహార్‌లో గెలుస్తారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

సేమ్ సీన్ రిపీట్!

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షాలు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎంలతో కలిసి పోటీ చేసింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని మోడీ ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఐఐటీ పాట్నాలో ప్రసంగించారు. మోడీ ఆధ్వర్యంలో ర్యాలీలూ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మంచి ఆస్పత్రులు, కంపెనీలు, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఓ సభలో మాట్లాడుతూ మోడీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్‌డ్ ఇండియా అని, బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. సహస్రలో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ బీహార్ అభివృద్ధికి 1.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇంత చేసినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీకి కేవలం 54 సీట్లు వచ్చాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏడాదికే జరిగిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి తారుమారు కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే మాదిరి ఇప్పుడూ జరగొచ్చనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.

రూట్ మార్చిన నితీశ్..

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్‌బంధన్ పేరిట పోటీ చేశారు నితీశ్ కుమార్. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలుప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రచారం చేయగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను ఎంచుకున్నారు. బీజేపీకి అధికారం రాకూడదనే కారణంతో నితీశ్ రాజకీయ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పొత్తుకు సై అన్నాడు. ఈ మహాకూటమికి వ్యూహకర్త పీకే(ప్రశాంత్ కిషోర్). ఈ కూటమి ఆధ్వర్యంలో హర్ ఘర్ దస్తక్(గడప.. గడపకు) అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. నితీశ్ కుమార్ ‘బీహారి సమ్మాన్ సమ్మేళన్’ పేరిట ప్రవాస బీహారీలను సన్మానించడం, వారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రచారం నిర్వహించారు. వీరి కూటమి(మహా ఘట్‌బంధన్) ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నితీశ్ ముఖ్యమంత్రిగా, ఆర్జేడీ నుంచి తేజస్వీయాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఆ తర్వాత లాలూ యాదవ్‌పై సీబీఐ దాడులు, తదనంతర పరిణామాల తర్వాత మహా ఘట్‌బంధన్ నుంచి 2017లో నితీశ్ బయటకొచ్చారు. బీజేపీ మద్దుతుతో మ్యాజిక్ ఫిగర్‌ను ఏర్పాటు చేసుకుని మళ్లీ తానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సుశీల్ కుమార్ మోడీని డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు.

ఇప్పటికీ అతి పెద్ద పార్టీ ఆర్జేడీనే..

బీహార్‌లో ఇప్పటికీ అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ ఉన్నది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ కూటమిగా సంఖ్యాబలంలో పుంజుకున్నది. అయితే, నితీశ్ తాజాగా తన పార్టీ నుంచి పీకే(ప్రశాంత్ కిశోర్), పవన్ వర్మ(జాతీయ అధికార ప్రతినిధి)లను తొలగించారు. అయితే, నితీశ్‌కు ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నాడు (2015)లో జేడీయూకు వచ్చిన ఓటింగ్ మహాకూటమిలో ఉండటం వల్లే వచ్చిందనీ, ఇప్పుడు ఆయన బీజేపీ పక్కన చేరి ఉన్నారని, వీటన్నింటిని ఓటర్లు గమనిస్తారని అంటున్నారు. పైగా బీజేపీ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వంటి అంశాల పట్ల నితీశ్ కచ్చితంగా స్పందించడం లేదు. ఇవే అంశాలపై పీకే, పవన్ వర్మ నిలదీస్తే వారిని పార్టీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ అంశాలూ, సామాజిక వర్గాలు బలంగా ఉన్న బీహార్‌లో అందరినీ పునరేకీకరించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, ఆర్‌ఎస్ఎల్పీ, జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎంలు కూటమిగా ఇప్పటికే ఉన్నా వారు బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందంటున్నారు. బీహార్‌లో సీపీఐ నాయకులు, జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ‘జన గణ మన’ పేరిట వామపక్ష పార్టీల మద్దుతుతో యాత్ర నిర్వహిస్తున్నారు. ఒక వేళ ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడితే నితీశ్‌కు గట్టి పోటీనే ఉండొచ్చు.

బీజేపీ ఆశలు అడియాసలేనా..?

2014 సాధారణ ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 22 గెలుపొందగా, తాజాగా 2019లో ఆ కూటమి 17 సీట్లు మాత్రమే పొందింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏ మేరకు సీట్లు సాధిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed