రెయిన్ కోట్లు, హెల్మెట్లే డాక్టర్లకు దిక్కు

by  |
రెయిన్ కోట్లు, హెల్మెట్లే డాక్టర్లకు దిక్కు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు రోజురోజుకీ పెరిగిపోతున్న కొవిడ్ కేసులు, మరోవైపు చాలీచాలని ఆసుపత్రి పరికరాలు… దీంతో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న వైద్యులకు సరైన రక్షణ లేకుండా పోయింది. వారిని వారు రక్షించుకోవడానికి హెల్మెట్లు, రెయిన్ కోట్లు ధరించి మరీ వైద్యం చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను తీర్చడానికి భారతప్రభుత్వం దక్షిణ కొరియా, చైనా దేశాల నుంచి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

దేశంలో అత్యంత జనాభా గల ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే 4700 మంది అంబులెన్స్ డ్రైవర్లు తమకు రక్షణ పరికరాలు కావాలని స్ట్రైక్ చేశారు. వైద్యం చేసే డాక్టర్లకు, సాయం చేసే వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు ఇవ్వలేని దుస్థితి ఈ కరోనా వైరస్ వల్ల కలిగింది. కేవలం ఇలా సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వల్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి దాదాపు లక్ష మందికి వైరస్ సోకే ప్రమాదముందని ఓ విశ్లేషణలో తేలింది.

కోల్‌కతాలోని బెలియఘాట ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆసుపత్రిలో డాక్టర్లు రెయిన్ కోట్లు వేసుకుని కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. అయితే చికిత్స సమయంలో రెయిన్ కోట్ చిరిగినా, చిన్న గీత పడినా ప్రమాదమే. తమ ప్రాణాల్ని రిస్కులో పెట్టుకుని ఇతరుల ప్రాణాలు కాపాడటానికి కొంతమంది జూనియర్ డాక్టర్లు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హర్యానాలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న డాక్టర్ సందీప్ గార్గ్ తమ ఆసుపత్రిలో ఎన్95 మాస్కులు అందుబాటులో లేకపోవడంతో హెల్మెట్ పెట్టుకొని చికిత్స చేసినట్లు చెప్పారు. అయితే ప్రపంచాన్ని మొత్తం అల్లాడిస్తున్న కరోనా మహమ్మారిని హెల్మెట్లతో అడ్డుకోవాలనుకుంటున్న డాక్టర్ల ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి.

Tags : Doctors, Kolkata, Hazmat suits, Rain coats, helmets

Next Story

Most Viewed