కరోనా వస్తే కాళ్లు తీసేస్తరంట

by  |
కరోనా వస్తే కాళ్లు తీసేస్తరంట
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘మా ఆసుపత్రిలో నెల రోజుల్లో 25-30% రోగులకు ఏదో ఒక రకంగా రక్తం గడ్డకట్టడం చూశాం. అది మెదడులో ఉంటే స్ట్రోక్. నరాల్లో ఉంటే డీవీటీ, రక్తనాళాల్లో ఉంటే ఎక్యూట్ లింబ్ ఇష్కేమియా వస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో మేం 14 కొవిడ్ పాజిటివ్ కేసుల్లో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం గుర్తించాం (ఎక్యూట్ లింబ్ ఇష్కేమియా). వాళ్లకు కాళ్లు నొప్పులు రావడంతో అత్యవసర చికిత్స చేశాం. రోగులను ఆలస్యంగా తీసుకురావడం వల్ల ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చింది. మూడు కేసుల్లో నరాల్లో తీవ్రంగా రక్తం గడ్డకట్టడంతో (డీవీటీ) వారికి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాకపోవడంతో సివియర్ కంపార్ట్ మెంట్ సిండ్రోమ్ వచ్చి చివరకు ప్రాణాలు పోయాయి’ అని కిమ్స్ ఆసుపత్రి చీఫ్ కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ నరేంద్రనాధ్ మేడా తెలిపారు. కొవిడ్-19 రోగుల ప్రాథమిక నివేదికల్లో డి-డైమర్ స్థాయి చాలా ఎక్కువగా ఉండటం గమనించారు. అది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిందనడానికి సూచిక. ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’ పత్రికలో 2020 మేలో ఒక పరిశోధక వ్యాసం ప్రచురితమైంది.

దీని ప్రకారం కొవిడ్-19 వల్ల రక్తం తీవ్ర స్థాయిలో గడ్డకట్టడం (హైపర్ కోగ్యులబిలిటీ)తో పాటుగా గడ్డలను కరిగించే సామర్థ్యం (ఫైబ్రినాలసిస్) కూడా నిలిచిపోతుందని, దాని వల్ల కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ లేదా మూత్రపిండాలు దెబ్బతినడం లాంటివి జరుగుతున్నాయని చెప్పారు. రోగులకు థ్రాంబోప్రొఫైలాక్సిస్ ఉన్నా, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, ఊపిరితిత్తులకూ అది వెళ్లడం (పల్మనరీ ఎంబాలిజమ్-పీఈ) చాలా సర్వసాధారణంగా కనిపించింది. రక్తనాళాల్లో గడ్డకట్టడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గడం, కాలి నరాల్లో గడ్డలు వచ్చి చివరకు కాళ్లు తీసేయాల్సి వస్తోందని వివరించారు. చైనాలో ఒక కరోనా రోగికి సార్స్-కొవ్-2 వచ్చి, అది కణాల్లోకి వెళ్లిందని గుర్తించారు. సార్స్ వైరస్ ఉపయోగించుకున్న ఏస్2 రిసెప్టర్ అదే. రెండు దశాబ్దాల క్రితం జరిగిన పరిశోధనల్లో మన శరీరంలో ఏస్2 రిసెప్టర్లను గుర్తించారు. అవి రక్తనాళాల్లోని కణాల్లో ఉంటాయని, వాటినే వాస్క్యులర్ ఎండోథీలియల్ కణాలు అంటారని చెప్పారు. మూత్రపిండాల్లోని మూత్రనాళిక కణాలు, పేగుల మార్గం, ముక్కులోని పొరలు, చివరకు వృషణాల్లోనూ ఇవి ఉంటున్నాయని తేలింది. న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హెర్మన్ పూర్ నేతృత్వంలో కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్నరోగులపై చిన్నగా పరిశోధించారు. న్యుమోనియా, ఇతర శ్వాసపరమైన ఇబ్బందులు ఉండి, కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న రోగులకు రక్తంలో గడ్డలను ఛేదించే మందులు ఇస్తే వెంటనే ఉపశమనం కనిపించిందన్నారు. కరోనా రోగులను పరిశీలించిన అనేకాంశాలను మీడియాకు వివరించారు.

రక్తం గడ్డలు కట్టడానికే అవకాశం

కొవిడ్-19 వ్యాధి రోగులకు ప్రోథ్రాంబోటిక్ పరిస్థితి (రక్తం గడ్డలు ఏర్పడటానికి అవకాశం) వస్తోంది. రక్తం తీవ్రస్థాయిలో గడ్డ కట్టడం (హైపర్ కోగ్యులబిలిటీ) ఇతర పరీక్షల ఫలితాల్లోనూ కనిపిస్తోంది. ఐతే ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే ఇతర సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లలా కాకుండా కొవిడ్ మాత్రం త్వరగా రక్తం గడ్డ కట్టించడం, పెరగడం (పల్మనరీ థ్రాంబోసిస్) వల్ల రక్త సరఫరా తగ్గిపోతుంది. వాయు మార్పిడి జరగక ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది. కొవిడ్-19తో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తరచుగా ఈ రక్తం గడ్డకట్టడం అనే సమస్య తీవ్రస్థాయిలో ఉంటోందని ఇప్పుడు గుర్తించారు. ‘కొవిడ్-19 వస్తే మరణం తప్పదని సాధారణ ప్రజానీకంలో చాలా భయాలున్నాయి. చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలై జులై మూడో వారానికి ప్రపంచ వ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు, 6 లక్షలకు పైగా మరణాలు సంభవించే స్థాయికి వ్యాపించింది. భారతదేశంలో ఈ వ్యాధి వల్ల మరణాలు కేవలం 2.3% మాత్రమే. కానీ ఎక్కువ మందికి వ్యాధి సోకడంతో భయం తప్పడం లేదన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కొవిడ్-19 అనేది ఒక రకమైన శ్వాసపరమైన వైరస్. దానికి టీకా గానీ, చికిత్స గానీ లేవని భావించేవారు. అయితే కొవిడ్-19 కేవలం ఊపిరితిత్తులనే కాక శరీరంలోని మూత్రపిండాలు, గుండె, పేగులు, కాలేయం, మెదడు లాంటి ఇతర భాగాలపైనా దాడి చేస్తుందని తర్వాతే తెలిసింది. ఇలాంటి సమస్యలను త్వరగా గుర్తించడంతో పాటు రక్తాన్ని పలచబరిచే (యాంటీ కోగ్యులేషన్) మందులను తగిన మోతాదులో ఇవ్వడం చాలా ముఖ్యమని డా.నరేంద్రనాధ్ తెలిపారు.

డాక్టర్ సూచనలు

కొన్నిసాధారణ సూచనలను అన్నిఆసుపత్రుల్లోనూ సులభంగా అమలు చేయవచ్చని డాక్టర్ చెప్పారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు ఊపిరి రేటు (సుమారు నిమిషానికి 20 కంటే ఎక్కువ). వేలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గి (ఆసుపత్రులకు వచ్చినప్పుడు పల్స్ ఆక్సీమీటరుతో సులభంగా పరీక్షించొచ్చు అది 93% కంటే తగ్గితే). వాళ్లు బాగానే కనిపిస్తున్నా ఈ మందులివ్వాలి. వీలైతే డీ-డైమర్ స్థాయిని వెంటనే పరీక్షించాలి. అవి పెరిగితే (సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువైతే) ఊపిరితిత్తుల్లో సమస్య వస్తున్నట్లు లెక్క. ఇలాంటి రోగులకు వెంటనే హెపారిన్ లేదా లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్ (ఎల్ఎండబ్ల్యుహెచ్)లను లక్షణాలు తగ్గేవరకు తగిన మోతాదులో ఇస్తుండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉండే కేసుల్లో రోగనిర్ధారణ అయిన వెంటనే ఎల్ఎండబ్ల్యుహెచ్ ఇవ్వాలి. కొన్ని పరిస్థితుల్లో ఈ మందుల వల్ల వేరే సమస్యలు రావచ్చు. అందువల్ల తగిన వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. దుష్ప్రభావాలు వస్తున్నాయేమోనని తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో రక్తం గడ్డకట్టడం అనే సమస్య గురించి ప్రజలతో పాటు వైద్యరంగ నిపుణులు కూడా తెలుసుకుని ఉండటం చాలా ముఖ్యం. వ్యాధి ఏ దశలో ఉంటే ఎంత మోతాదులో ఈ మందులు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఆరోగ్యంగా ఉండటానికి సూచనలు

– మంచం మీదే విశ్రాంతి తీసుకోకూడదు.
– తగినంత నీళ్లు తాగుతూ చురుగ్గా ఉండాలి.
– కాలి వ్యాయామాలు (పాదాలు తరచూ కదిలిస్తుండటం), ఊపిరి వ్యాయామాలు చేస్తుండాలి.
– హోం క్వారంటైన్ సమయంలో కాలు వాచినా, ఉన్నట్టుండి నొప్పి పుట్టినా లేదా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అయినా వెంటనే వైద్యులను సంప్రదించండి.



Next Story

Most Viewed