స్కూల్స్ రీఓపెన్.. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు ఫ్రీ

by  |
స్కూల్స్ రీఓపెన్.. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు ఫ్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిబ్రవరి ఒకటినుంచి తొమ్మిది, పది తరగుతుల విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. కొవిడ్ నివారణకు విద్యాశాఖ సరఫరా చేసిన సామగ్రి ప్రభుత్వ పాఠశాలలకు చేరింది. ప్రవేట్ హైస్కూళ్లలోనూ భౌతిక తరగతులు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై మానిటరింగ్ కమిటీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి.

మండల స్థాయిలో ఐదుగురితో కూడిన మానిటరింగ్ కమిటీ సభ్యులు స్వయంగా పాఠశాలలను సందర్శించి రిపోర్టులను సిద్ధం చేస్తున్నారు. అన్ని స్కూల్స్‌పై రిపోర్టులను జిల్లా విద్యాధికారులు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర వేల హైస్కూళ్లలో ఇదున్నర లక్షల వరకు తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల ఒక్కొక్కరికీ జత మాస్క్‌లు, శానిటైజర్లు, పాఠశాలకొక థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను విద్యాశాఖ అందించింది.

సమస్యల మీద చర్చించి

పాఠశాలలకు అవసరమైన వసతులు, ఇతర సమస్యలపై సోమవారం డీఈఓలు ప్రధానోపాధ్యాయులతో సంప్రదింపులు జరిపారు. కొవిడ్ జాగ్రతలకు సంబంధించిన శానిటైజర్లు సరఫరా చేసినప్పటికీ, రోజూ విద్యార్థులు వాటిని వినియోగించే విధంగా చూసే వ్యవస్థ లేదని స్కూల్ టీచర్లు చెబుతున్నారు. తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన సర్వీస్ పర్సన్స్‌పై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్యలు తప్పవని అంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల మెడికల్, మధ్యాహ్న భోజన మానిటరింగ్ టీములలో టీచర్లను భాగస్వామ్యం చేశారు.
అయితే సర్వీస్ పర్సన్స్, భోజన కార్మికుల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు భోజనం అందిస్తామని ప్రభుత్వం చెప్పినా ఏజెన్సీలకు బాధ్యతలు అప్పజెప్పలేదు. ఈ క్రమంలో పథకాన్ని ఎలా అందించగలుగుతామని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 27న జిల్లా విద్యాధికారులంతా మరోసారి ప్రధానోపాధ్యాయులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలపై రివ్యూ చేయడంతోపాటు ఇతర ప్రణాళికలపై చర్చించనున్నారు. తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశముందని హైదరాబాద్ జిల్లా హెడ్మాస్టర్ ఒకరు తెలిపారు.


Next Story

Most Viewed