జూన్ నుంచి ప్రతి వ్యక్తికి 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ

by  |
free rice
X

దిశ, తెలంగాణ బ్యూరో : క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. క‌రోనా, లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయి అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌లకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వర్యంలో జూన్, జూలైలకు కలిపి ప్రతీ ఒక్కరికి 20కిలోల ఉచిత బియ్యాన్ని అందించనుంది. ప్రతినెలా అందించే బియ్యానికి 10కిలోలు అద‌నంగా జ‌త‌చేసి జూన్ నెలలో లక్షా 78వేల మెట్రిక్ టన్నులకు అదనంగా 2లక్షల 53వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు.

జూలైలో ఐదు కిలోలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌లో అందించే రేష‌న్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే 15 కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు 15 కిలోలు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా అందజేయనుంది. మొద‌టి ద‌శ లాక్‌డౌన్‌లో మే నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కూ ఉచితంగా రేష‌న్ అందించిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో గ‌తంలో ఇచ్చిన 12 కిలోల‌ మాదిరిగానే ఈసారి 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు.

కార్డులో ఎంత మంది వ్యక్తులుంటే అంద‌రికీ ఒక్కోక్కరికి 15కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప‌రిధిలోకి రాని ల‌బ్ధిదారుల‌కు సైతం తెలంగాణ‌ ప్రభుత్వం ఈ ప్రయోజ‌నాన్ని అందించ‌నుంది. అంత్యోద‌య కార్డు దారుల‌కు 35కేజీల‌కు అదనంగా మ‌రో 10కిలోలు, అన్నపూర్ణ కార్డుదారుల‌కు 10కిలోల‌కు అద‌నంగా మ‌రో 10 కిలోలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని మొత్తం కార్డులు 87, 42,590 కాగా, 2కోట్ల 79లక్షల 24వేల 300 మందికి ఎలాంటి పరిమితి లేకుండా లక్షా 78వేల మెట్రిక్ టన్నుల రెగ్యులర్ బియ్యానికి తోడు 2 లక్షల 53వేల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయనుంది. రేషన్ డీలర్లందరికి కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టిన సందర్భంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు జూన్ 5నుంచి రాష్ట్రంలో రేషన్ పంపిణీ కొనసాగుతుంది.

ఆకలితో అలమటించొద్దనే..

కరోనా సంక్షోభంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించొద్దని ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుందని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. కడుపు నింపాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న బియ్యానికి తోడు జూన్, జూలైలకు కలిపి ప్రతీ ఒక్కరికి 20కిలోల ఉచిత బియ్యాన్నిఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed