జెండా మోసినోళ్ల ఆవేదన.. అన్నకు చేరేనా?

by  |
జెండా మోసినోళ్ల ఆవేదన.. అన్నకు చేరేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: “పార్టీ ఆవిర్భావం నుంచి ఎత్తిన జెండా దించలేదు. నాటి టీడీపీ ప్రభుత్వం నుంచి వివక్షను ఎదుర్కొన్నాం. అర్హత ఉండీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యాం. చివరకు ఘర్షణ పడి కేసులపాలయ్యాం. తొమ్మిదేళ్లపాటు పార్టీనే నమ్ముకొని సర్వం కోల్పోయాం. మరి అప్పటి నుంచి జెండా మోసినోళ్లకు ఏం లేదా సార్! అధికారం వచ్చాక కొత్తగా పార్టీలో చేరినోళ్లదే హవా నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడడం లేదు! ఇందుకోసమేనా ఇన్నాళ్లూ పనిచేసింది!’’ అంటూ ఒకరిద్దరు వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందని కదిలిస్తే తమ బాధలను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ దిగువ శ్రేణి కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న ఆక్రోశం ఇది. కొన్ని చోట్ల మౌనంగా ఉంటే మరికొన్నిచోట్ల పార్టీలో గ్రూపులకు దారి తీసింది.

రాష్ట్రమంతా వైఎస్జగన్మూడేళ్ల నాటి ప్రజా సంకల్పయాత్రను స్మరించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. పది రోజులపాటు విసృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఇటీవలనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందారా.. లేక ఇంకా ఏవైనా పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందా అనే కోణంలో నాయకులు, కార్యకర్తలు పరిశీలించాలని ఆయన చెప్పారు. దీనిపై పార్టీ నాయకత్వం మొత్తం శుక్రవారం నుంచి పాదయాత్రలు మొదలు పెట్టారు. నియోజకవర్గాల్లో ధూంధాం చేశారు. కొన్ని చోట్ల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. పార్టీలో నూతనుత్తేజాన్ని నింపేందుకు సందడి చేశారు.

అదే సందర్భంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవాళ్లున్నారు. పార్టీ నేతలపై తిరగబడుతున్న వాళ్లున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటి ముందే అసంతృప్తి వర్గం బైఠాయించి నిరసన తెలిపింది. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే ఏకంగా కేసులు పెట్టుకొని అరెస్టులదాకా దారితీసిన పరిస్థితులున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాకు వ్యతిరేకంగా మొన్నా మధ్య అసంతృప్తి వర్గం ఉవ్వెత్తున లేచింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కొన్ని మండలాలు పూర్తిగా పార్టీకి దూరమయ్యాయి. కొండపి నియోజకవర్గంలో అసంతృప్తులు తారా స్థాయికి చేరాయి. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి గ్రూపుల మధ్య నలిగిపోయిన కార్యకర్తలు, నాయకుల జాబితా చాంతాడంత ఉంది. తాజాగా చీరాల నియోజకవర్గంలో కరణం బలరాం, ఆమంచి గ్రూపులు పోటాపోటీగా పాదయాత్రలు చేపట్టారు. ఎక్కడ కలబడి కొట్టుకుంటారోనని పోలీసులే హడలెత్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ఫోన్కాల్స్ను మరోనేత పోలీసులతో ట్యాంపరింగ్చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ దిగువ స్థాయి కార్యకర్తల్లో పార్టీ నేతలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

పార్టీ అధికారానికి వచ్చాక ఓ దఫా విజయసాయి రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు ఓ ప్రయత్నం జరిగింది. ఏ కారణం చేతనో తర్వాత కాలంలో అది ముందుకు సాగలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని రైలు పట్టాల్లాగా నడిపించాల్సిన బాధ్యత పార్టీ అధినేత జగన్పై ఉంది. ఈ పని సజావుగా జరగడం లేదు. ప్రత్యేకంగా టీడీపీ నుంచి పార్టీలోకి చేరిన నియోజకవర్గాల్లో ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకే పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధులు అధిక ప్రాధాన్యమిస్తున్నారనే కారణంతో అలకపూనిన వాళ్లకు కొదవ లేదు. అసంతృప్తులు, అలకలను క్షేత్ర స్థాయిలో పిలిచి సర్దుబాటు చేసే యంత్రాంగం పార్టీలో లేదు. ఏదైనా రోడ్డెక్కి గలాటా జరిగితేనే పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు. ఆదిలోనే వీటికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పార్టీ ప్రయత్నిస్తుందా.. లేక ఇవి మరో రూపం దాల్చడానికి దోహదపడుతుందో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed