కొత్త రోగాలొస్తున్నాయి..

by  |
కొత్త రోగాలొస్తున్నాయి..
X

సహజసిద్ధమైన జలాలు, పలు రకాల పక్షులు, చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదం గా ఉండేది. సాయంత్రం సమయంలో పక్షులు, సందర్శకులు, వాకింగ్ చేసే వారితో చెరువు పరిసరాలు సందడి గా మారేవి. చెరువు మధ్యలో ఏపుగా పెరిగిన మొక్కలతో ఐలాండ్ అందంగా ఉండేది. ఇదంతా సఫిల్ గూడ చెరువు ఒకప్ప టి వైభవం.. ఇప్పుడా పరిస్థితి లేదు.. నీరంతా కాలుష్యం కమ్మింది. పక్షులు కనిపించట్లేదు. పరిసరాలు చెత్తాచెదారంతో నిండి జనం ఊసేలేదు. గతంలో సుందరీకరించిన చెరువు కాస్తా.. ఇప్పుడు మురుగు గుంతను తలపిస్తోంది. సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై దిశ ప్రత్యేక కథనం..

దిశ, తెలంగాణ బ్యూరో: 1994-99 కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 8 చెరువులను సుమారు రూ. 45కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరించింది. అందులో ఒకటి సఫిల్ గూడ చెరువు. దీనిని నడిమి చెరువు కూడా అంటారు. శుభ్రమైన జలాలతో మెరిసేది. పలురకాల పక్షులతో అలరారేది. కానీ, ఇప్పుడది మురుగుగుంతగా మారింది. స్థానిక కాలనీల నుంచి మురుగంతా చెరువులోకి చేరుతుంది. దుర్వాసనకు నెలవుగా మారింది. గుర్రపుడెక్కతో నిండిపోయింది. ప్రభుత్వం ఆదరణ కరువైంది. నిర్వహణ మచ్చుకైనా లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతామని సర్కార్‌ ప్రకటించింది. అందులో భాగంగానే లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కానీ, అది వట్టి మాటలని తేలిపోయింది. పర్యాటక ప్రాంతాల మాట దేవుడెరుగు కానీ, కోట్లాది రూపాయలను వెచ్చించి సుందరీకరించిన చెరువులే కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.

రూ.4కోట్లతో సుందరీకరణ..

సఫిల్ గూడ(నడిమి) చెరువు 70 ఎకరాల విస్తీర్ణం. అది ఆక్రమణలతో 25 ఎకరాలకు కుంచించుకుపోయింది. ఈ చెరువును కాపాడేందుకు 1999లో అప్పటి ప్రభుత్వం సఫిల్ గూడా మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ది చేసింది. అందుకు నెథర్‌ల్యాండ్స్ దేశ ఆర్థిక సహాకారాన్ని తీసుకుంది. సుమారు రూ. 4కోట్ల వ్యయంతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. నీరున్న ప్రాంతం మేరకు చుట్టూర బండ్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం మురుగును చెరువులోకి చేరకుండా శుద్ధిచేసిన నీటిని వదులుతుంది. చెరువు మధ్యలోని ఐల్యాండ్ ను మరిన్ని చెట్లు నాటి మరింత పచ్చగా చేసింది అప్పటి ప్రభుత్వం. దానిలో పక్షులు చేరేవి. తాజానీటిలో బోటింగ్ ఉండేది. బండ్‌పై పూదోట ఉండేది. ఈ చెరువులోకి పైన ఉన్న రామక్రిష్ణాపురం చెరువు నుంచి నీరు వచ్చేది. కానీ, ప్రస్తుతం రామక్రిష్ణాపురం చెరువు ఎండిపోయింది. సఫిల్ గూడ చెరువులోకి పరిసర ప్రాంతాల నుంచి వెలువడే మురుగు వచ్చి చేరుతుంది. దీంతో దుర్గంధభరితంగా మారింది. సుందరీకరణ కనుమరుగైంది. సహజత్వం కోల్పోయింది.

కొత్త రోగాలొస్తున్నాయి..

కాలనీల నుంచి వచ్చి చేరిన మురుగు ఏండ్ల తరబడి చెరువులోనే నిల్వ ఉండడంతో కొత్త రోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మురుగు, కాలుష్యాల వల్ల చెరువులోని జలచరాలు పలుమార్లు మృత్యువాతపడ్డాయి. ఎండాకాలం వస్తే మురుగు ఎండిపోతూ దుర్గంధం వెదజల్లుతుంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు నిండా గుర్రపుడెక్కతో పాటు చెత్త పేరుకుపోయింది. ‎ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చెరువు పరిసరాల్లో వాకర్స్ నేడు నడవడానికి భయపడుతున్నారు. చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, వాకింగ్‌కు రావడం మానేసినట్టు వాకర్స్ పేర్కొంటున్నారు. ఈ నీటితో జలచరాలు, పక్షుల మనుగడ కూడా ప్రమాదకరంగా మారింది. ‘సాఫ్‌ హైదరాబాద్‌.. షాన్‌దార్‌ హైదరాబాద్‌’గా తీర్చిదిద్దుతామని నాయకులు గొప్పలే తప్పా… ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన చెరువు కాలుష్యంతో ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది.

Next Story