పంపకాల్లో ‘పదవులు’

by  |
పంపకాల్లో ‘పదవులు’
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ చైర్మన్ పదవుల పంపకాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. డైరెక్టర్ పోస్టులతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు అభ్యర్థుల విషయమై సుదీర్ఘ కసరత్తు చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించి చివరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మాజీమంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, విఠల్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు పురాణం సతీష్‌లతోపాటు జిల్లా సీనియర్ నేతలు పలుదఫాలుగా చర్చలు జరిపి చివరకు ఏకాభిప్రాయంతోనే డైరెక్టర్ పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం.
ఆ తరువాత అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లందరికీ ఎన్నికల్లో అనుసరించబోయే విధానంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక అధిష్టానం నిర్ణయించిన మేరకే జరిగిందని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అందిన సమాచారం మేరకు డీసీసీబీ చైర్మన్ పదవి ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి, డీసీఎంఎస్ చైర్మన్ పదవి తూర్పు ప్రాంతానికి ఇవ్వాలని నిర్ణయించారు. వైస్ చైర్మన్ పదవులు కూడా తూర్పునకు, పశ్చిమానికి ఒక్కోటి చొప్పున తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఆదిలాబాద్‌కు చెందిన అడ్డి భోజారెడ్డిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. డీసీఎంఎస్ చైర్మన్ పదవికి మంచిర్యాల చెన్నూరు ప్రాంతానికి చెందిన లింగన్నకు అవకాశం దక్కబోతోంది. ఇక డీసీసీబీ వైస్ చైర్మన్ పదవి నిర్మల్‌కు చెందిన రఘునందన్ రెడ్డికి ఇవ్వనుండగా..డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పదవి ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ప్రాంతాల నేతల్లో ఒకరికి కట్టబెట్టాలని అంగీకారం కుదిరినట్టు సమాచారం.


Next Story