సువర్ణ.. నువ్వు సూపర్… చిత్రకళకు అంగవైకల్యం అడ్డు కాలేదు..

by  |
సువర్ణ.. నువ్వు సూపర్… చిత్రకళకు అంగవైకల్యం అడ్డు కాలేదు..
X

దిశ, చండూరు : పేదరికం, అవిటి తనం తన మేధాసంపత్తికి అడ్డు కాకూడదని ఓ ఫ్లోరోసిస్ దివ్యాంగురాలు తన చిత్రకళా నైపుణ్యంతో అందరిని అబ్బురపరుస్తోంది. ప్రముఖుల చిత్రపటాలు వేసి వారి నుండి సుమారు రూ.5.50 లక్షలు ఆర్థిక పరిపుష్టి సాధించి తన తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరూపించింది. బాహ్య ప్రపంచాన్ని చూడకుండా తన కళా నైపుణ్యంతో అందరి అభిమానాన్ని చూరగొంది ఫ్లోరోసిస్ దివ్యాంగురాలు రమావత్ సువర్ణ. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదబక్ష పల్లి గ్రామపంచాయతీ లోని సాయి బండ తండాకు చెందిన రమావత్ బిక్కు, పరంగి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఆయురారోగ్యాలతోనే ఉండగా చిన్నవారైన సువర్ణ, రమేష్‌లకు ఫ్లోరైడ్ మహమ్మారి సోకి కాళ్లు వంకర్లు పోయి కదలలేని పరిస్థితి. ఈ ఇద్దరిని చూసి తల్లిదండ్రులు నిత్యం కన్నీళ్లే. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు వారికి అన్నీ తామై చూస్తుంటారు.

అందుకు సువర్ణ, రమేష్‌లకు ప్రత్యేకంగా ఒక గుడిసె వేసి వారిని అందులోనే ఉంచారు. రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదని సువర్ణ తన శక్తి సామర్థ్యంతో చిత్రకళలో పట్టు సాధించింది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచు కట్ల సుభాష్, ఎన్ఆర్ఐ జలగం సుధీర్‌ల సహాయంతో చిత్ర పటాలను సేకరించి తన చిత్రకళా నైపుణ్యంతో ప్రముఖుల చిత్రాలను గీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత గవర్నర్ తమిళ సై సౌందరరాజన్, మంత్రి హరీష్ రావులా చిత్రపటాలను గీసింది. ఎన్ఆర్ఐ జలగం సుధీర్ ట్విట్టర్ వేదికగా చిత్రపటాలను సమాజానికి పరిచయం చేయడంతో కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి రూ.5.50 లక్షలను సువర్ణ ఖాతాలో జమ చేశారు.

దీంతో సువర్ణ ఆనందానికి అవధులు లేవు. ఇటీవల వేసిన గవర్నర్ సౌందరరాజన్ చిత్రపటం ట్విట్టర్‌లో చూసిన గవర్నర్ సువర్ణకు అభినందనలు తెలిపారు. నాలాంటి ఫ్లోరోసిస్ బాధితుల ఎందరో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు అని నెలకు రూ.10 వేల పెన్షన్, ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించాలని, ఆధునిక వైద్య సహాయం అందించాలని సువర్ణ ట్విట్టర్ ద్వారా గవర్నర్‌ను కోరింది. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న సువర్ణ ముందు ముందు మరింత పురోగతి సాధించాలని “దిశ” కోరుకుంటుంది. హాట్సాఫ్ సువర్ణ .


Next Story

Most Viewed