డిండి ప్రాజెక్టు పనుల్లో పోలీసులొచ్చారు.. అసలేంజరిగింది..?

by  |
డిండి ప్రాజెక్టు పనుల్లో పోలీసులొచ్చారు.. అసలేంజరిగింది..?
X

దిశ, చండూరు : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గుత్తేదారు అక్రమంగా వందలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఫిబ్రవరి 12 నుంచి సుమారు 400 మంది పోలీసుల మధ్య కిష్టారాయనిపల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో కిష్టరాయినిపల్లి పరిధిలో లక్ష్మణాపురం, ఈదులగండి భూ నిర్వాసితుల ఆవేదనపై ప్రత్యేక కథనం.

రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శివన్న గూడెం రిజర్వాయర్​లో 2013లో శంకుస్థాపన చేశారు. కిష్టరాయిని పల్లి రిజర్వాయర్​లో రెండు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఎస్ లింగోటం పరిధిలో ఉన్న లక్ష్మాపురం పూర్తిగా ముంపునకు గురవుతుండగా, చింతపల్లి మండలంలోని కిష్ట రాయినిపల్లి పంచాయతీలో ఉన్న ఈదులగండి కూడా మునిగిపోబోతున్నది.

ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు లక్ష ఎకరాలు ఉండగా ప్రభుత్వం 2045 ఎకరాల భూసేకరణకు 1890 ఎకరాలు సేకరించింది. 2013 చట్టం ప్రకారం ముంపునకు గురయ్యే భూములకు పరిహారంతోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించిన తర్వాతే పనులు చేపట్టాలి. కానీ ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తూ పునరావాస పరిహారంపై స్పష్టత ఇవ్వకపోగా బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండడంతో నిర్వాసితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నా గుత్తేదారు పలుకుబడిని ఉపయోగించి పనులు చేయిస్తున్నాడని భూ నిర్వాసితులు వాపోతున్నారు. గత డిసెంబర్ 27న పనులు నిర్వహించవద్దని భూ నిర్వాసితులు అడ్డుపడగా పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దాడులను నిరసిస్తూ భూ నిర్వాసితులు అదే నెల 29న నల్గొండ కలెక్టరేట్ ముట్టడించి ధర్నా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో కలిసి కలెక్టర్, ఎస్పీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత మరోమారు కూడా భూనిర్వాసితులతో చర్చలు జరుపుతున్న సమయంలో కలెక్టర్​ ప్యాకేజీ తగ్గించి చెప్పడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన అర్థంతరంగా వెళ్లిపోయాడు. గుత్తేదారు పనులను నిలిపి వేశాడు. కాగా, ఫిబ్రవరి 12 నుంచి పోలీసు బందోబస్తుతో పనులు మళ్లీ మొదలయ్యాయి. దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసు సిబ్బంది పనులకు బందోబస్తు ఉన్నారు. 16 రోజులుగా లక్ష్మణా పురం గ్రామాన్ని పోలీసులు అష్ట దిగ్బంధనంలో ఉన్నారు. దీంతో భూనిర్వాసితులు రజాకర్లు కూడా ఇంతటి నిర్బంధం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అష్టదిగ్బంధనంలో లక్ష్మణాపురం

కిష్ట రాయపల్లి రిజర్వాయర్​లో ముంపునకు గురవుతున్న లక్ష్మణాపురం పూర్తిగా పోలీసుల వలయంలో చిక్కుకుంది. నిర్వాసితులు ప్రాజెక్టు వద్దకు రాకుండా అన్ని దారులు వద్ద చెక్ పోస్ట్ లు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు. గ్రామానికి ఏ కొత్త వ్యక్తి వచ్చినా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

నల్గొండ కలెక్టర్ కు హెచ్ఆర్సీ నోటీసులు

ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో పనులు చేయిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని నిర్వాసితులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. స్పందించిన హెచ్ఆర్సీ మార్చి 15 వరకు పూర్తి వివరణ అందజేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్​కు నోటీసులు పంపింది.

రజాకార్లు కూడా ఇంత నిర్బంధం చేయలేదు: గడ్డి రాములు, భూ నిర్వాసితులు

భూమి తల్లిని నమ్ముకుని 80 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం. కానీ ఆరేళ్ల కిందట మా గ్రామానికి యమభటులు వచ్చి కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. గుత్తేదారు, ఉన్నతాధికారులు మాపై దమనకాండ జరుపుతున్నారు. రజాకార్లు కూడా ఇంత నిర్బంధం చేయలేదు. మాకు పునరావాసం ప్యాకేజీ ఇచ్చి అందరికీ ఒకే చోట ఇళ్లు కట్టించి ఇవ్వాలి.


Next Story

Most Viewed