శివుడు ధరించే ప్రతి ఆభరణం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా..

by Disha Web Desk 20 |
శివుడు ధరించే ప్రతి ఆభరణం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా మహాశివరాత్రికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివునికి సంబంధించిన పండగలలో మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. ఈ పండగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఈ రోజున పరమశివుడు, పార్వతి దేవి కళ్యాణం జరిగినట్లు ప్రతీతి. ఈ రోజున శివభక్తులు కఠిన ఉపవాసాలు ఉంటారు. శివుడిని భక్తితో పూజించి శివలింగానికి అభిషేకం చేస్తారు. అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8, 2024 శుక్రవారం వస్తుంది.

సమస్త సృష్టి కారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది, అనంతం రెండూ అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలోని అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు, నగలు ధరించకుండా భస్మంతో అలంకరిస్తారు. అతను మెడలో పాముని ధరించి, నుదుటి పై చంద్రుడిని అలంకరించుకుంటారు. అంతే కాదు జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శివుని 10 ఆభరణాలు.. వాటి అర్థం

తలపై చంద్రుడు

నెలవంక శివుని తల పై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంధాలలో శివుడిని సోమ, చంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తల పై కూర్చున్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.

మెడలో పాము

శివుడు పూలు లేదా నగలు ధరించడు. కానీ పామును మాత్రం మెడలో వేసుకుని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకి గా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండటం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది.

మూడవ కన్ను

శివునికి మూడు కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితులలో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు.

త్రిశూలం

శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. భౌతిక వేడిని నాశనం చేయడానికి త్రిశూలాన్ని ఆయుధంగా చెబుతారు. శివుని త్రిశూలంలో రాజసి, సాత్విక్, తామసి అనే మూడు గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.

చేతిలో ఢమరుకం..

ఢమరుకం ఆడగానే శివుని తాండవం మొదలవుతుందని, శివుడి తాండవం వల్ల విధ్వంసం మొదలవుతుందని చెబుతారు. బ్రహ్మ స్వరూపంగా భావించే పరమశివుని ఢమరుకం విశ్వ శబ్దం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఢమరుకం ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత వాయిద్యం అని కూడా అంటారు. శివుని చేతిలోని ఢమరుకం సృష్టి ప్రారంభానికి, బ్రహ్మ శబ్దానికి సూచిక.

రుద్రాక్ష..

శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతాయి. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం.

గంగ

శివుని కేశవూలలో గంగను చేర్చారు. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు.

పులి చర్మం..

పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు పులిచర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు.

నంది

నంది, వృషభ, ఎద్దు శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది నాలుగు పాదాలు మతం, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి.

భస్మం

శివుడు తన శరీరం పై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒక రోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది.

Next Story

Most Viewed