కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ది శూన్యం : సీతక్క

by  |
కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ది శూన్యం : సీతక్క
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ది అమడదూరంలో ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25వ తేదీలలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షను చేడుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కో అర్డినేటర్లు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి, తోటకూర వజ్రేజ్ యాదవ్ లతో కలిసి దీక్ష సభాస్థలి ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. 2017లో మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారన్నారు. దత్తత తీసుకుని నాలుగేళ్ల కావస్తున్నా ఆ గ్రామాలలో అభివృద్ది శూన్యమని తెలిపారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలలో ఏ మేరకు అభివృద్ది జరిగిందన్న విషయాన్నే.. తాము దీక్షలో ఎండగడతామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదని, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు.

దళితుల అభివృద్ది ఏక్కడ..?

ఎన్నికల మేనిఫెస్టోలో దళితుడిని సీఎం చేస్తానని తానే గద్దెనెక్కారని సీతక్క మండిపడ్డారు. కనీసం సీఎం దత్తత గ్రామాల్లోనైనా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు మంజూరయ్యాయా..? ఇండ్లు కేటాయించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారా..? గిరిజనులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా..? ఉపాధి లభించిందా..? పారిశ్రామిక వేత్తలుగా ఎవరైనా ఎదిగిరా..? అని సీతక్క ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన లక్షలాది ఎకరాల భూములను గుంజుకోని పేదలను మరింత పేదలుగా మార్చడం తగదని హెచ్చరించారు. దళిత బంధు వంటి పథకాలను తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరని, కేవలం దళితులకు మూడెకరాల భూమి నుంచి తప్పించుకోకుండా ప్రయత్నమేనని మండి పడ్డారు.

ఎన్నికల కోసం పథకాలు..

అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటిస్తే దానికి అర్ధముంటుందని, ఏ పూటకు ఎన్నికలు ఉంటే ఆపూటకు ప్రజలను నమ్మించేందుకు పథకాలను తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ ప్రత్యేక పథకాలతో ప్రజలను సీఎం కేసీఆర్ మభ్య పెట్టి ఓట్లను దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనకు ప్రయోజనకరంగా ఉన్న వాసాలమర్రి, ఎర్రబెల్లి, ముల్కనూరు వంటి గ్రామాల్లో ప్రత్యేక పథకాలు అంటు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24, 25వ తేదీలలో మూడుచింతలపల్లిలో రెండు రోజుల పాటు చేపట్టే దీక్షను జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 24న ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై మరుసటి రోజు ముగుస్తుందన్నారు. భారీ సంఖ్యలో దీక్షలో పాల్గొనాలని సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శామీర్ పేట, మూడు చింతల పల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story