ఆసిఫా ‘బాధ’.. బోర్డు మారినా..సేవలు శూన్యం..!

by  |
ఆసిఫా ‘బాధ’.. బోర్డు మారినా..సేవలు శూన్యం..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆసిఫాబాద్​ గతంలోనే జిల్లా కేంద్రం.. 1960 కు పూర్వం మున్సిపాలిటీగా కూడా ఉంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద మేజర్​పంచాయతీగా సేవలందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆసిఫాబాద్ మళ్లీ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ఇంత చరిత్ర ఉన్నప్పటికీ ఆసిఫాబాద్ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.

మున్సిపాలిటీగా మారినప్పటికీ.?

కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా ఎదిగింది. అయితే ఇప్పటికీ ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీగా మాత్రం గుర్తించడం లేదు. ఇందుకు కారణం… ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతం కావడమే. 1/70 చట్టం నిబంధనలు అమలులో ఉన్న కారణంగా మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా ఆసిఫాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేక పోయారు. ఏడాది గడుస్తున్నా మున్సిపాలిటీ పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. దీంతో ఆసిఫాబాద్​గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఉండడం గమనార్హం.

ఇప్పటికీ పంచాయతీ పాలనే.!

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గ్రామపంచాయతీ స్థాయిలోనే పాలన కొనసాగుతోంది. నిధులతో మొదలుకొని కార్యాలయ కార్యకలాపాలు, పనులు, రసీదులు ఇలా అన్ని గ్రామపంచాయతీ స్థాయిలోనే సాగుతుండడం గమనార్హం. ఇదేంటని ఎవరైనా అడిగితే ఎవరి వద్ద స్పష్టమైన సమాధానం ఉండదు. ఒక ప్రత్యేక అధికారిని నియమించినప్పటికీ.. ఆయనను ఇటీవల తొలగించి మళ్లీ పంచాయతీ కార్యదర్శికే బాధ్యతలు అప్పగించారు. అంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ మళ్లీ గ్రామపంచాయతీ స్థాయికి దిగజారింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అంటే అవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో మున్సిపాలిటీగా ఉండగా… పాలన మాత్రం పంచాయతీ స్థాయిలో కొనసాగుతుండం అనేక వివాదాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని ప్రాంతాల్లో ..!

మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ ఎన్నికలు జరగని కారణంగా పాలన అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ జిల్లా కేంద్రం అయిన ఉట్నూరు ను కూడా మున్సిపాలిటీ గా మార్చారు. ఇక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. పుర, పంచాయతీల పాలక వర్గాలు లేవు. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీకి గడిచిన 20 ఏళ్లుగా పాలకవర్గమే లేదు. అనాలోచిత నిర్ణయాల కారణంగా అభివృద్ధి చెందాల్సిన పట్టణాలు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. దీనికి రాష్ట్ర స్థాయిలో పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరముందని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed