Y. S. Sharmila:పస లేదు.. తగ్గిన క్రేజ్!

by  |
Ys-Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని లాంఛనంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వమే ఎజెండాగా ఆమె ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె పూనుకున్నారు. వచ్చే వారంలో పోడు సమస్యలపై కూడా పోరాటం చేసేలా ఆమె ప్లాన్ చేసుకున్నారు. అయినా ప్రజల మన్ననలు మాత్రం ఆమె పొందలేకపోతున్నారు. నిరుద్యోగ యువత కోసం నిరాహారదీక్ష చేపడుతున్నా పట్టుమని 50 మంది రావడంలేదు. దీంతో రాజకీయవర్గాల్లో షర్మిలకు క్రేజ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది.

ఇక జిల్లాల పర్యటనల్లోనూ పార్టీ నాయకులు తప్పా ఎక్కడా పెద్దగా ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది. జన సమీకరణలో నేతలు ఫెయిల్ అవడంపై షర్మిల మండిపడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఆవిర్భావం నాడు కూడా షర్మిల ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రసంగాల్లో పస లేకపోవడమేనా?

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుంచి షర్మిల అన్ని జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆ సమయంలో తెగ హడావుడి చేసిన నేతలు సైతం క్రమంగా లోటస్ పాండ్ కు రావడం తగ్గించేశారు. అయితే ఇందుకు మూస పద్ధతిలో కొనసాగుతున్న షర్మిల ప్రసంగాలే కారణంగా చెబుతున్నారు కొందరు నేతలు. గతంలో పలుమార్లు తెలంగాణ యాసను అనుకరించేందుకు షర్మిల ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ అయినట్లుగా కనిపించడంలేదు.

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలంటే ఈ విధానం సరిపోదని పలువురు నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమె ప్రతీ మీటింగ్‌లో చెప్పే అంశాలనే తిరిగి మరో మీటింగ్‌లోనూ చెప్పడం వల్ల కూడా కొంత మైనస్ అవుతున్నట్లు వారు చెబుతున్నారు. దీనివల్ల పార్టీలో చేరేవారి సంగతి పక్కన పెడితే దూరమయ్యే వారే అధికమవుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం సమయంలోనూ ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు చేరుతారని చెప్పి చివరకు ఉసూరుమనిపించారు.

‘షర్మిలమ్మ’ అని పిలవాలని ఆదేశాలు!

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలను నాయకులు, వైఎస్సార్ అభిమానులు ‘షర్మిలమ్మ’ అని పిలవాలని ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలా పిలవడం హుందాతనానికి నిదర్శనంగా లోటస్ పాండ్ వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఇక్కడి ప్రజలకు ఏమాత్రం సెట్ అవ్వదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షర్మిల ఎంచుకునే సబ్జెక్ట్ కూడా పెద్దగా జనాలకు చేరువకావడం లేదని తెలుస్తోంది. అందుకే నిరుద్యోగ యువత కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షకు పూనుకున్నా.. పెద్దగా ఆసక్తి కనబరచడంలేదని సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి కూడా ఇలాగే ఉండేదని, సీఎంగా లేని సమయంలోనూ ఎంత ఆత్మీయులైనా సరే.. సర్ అని పిలవాల్సిందేనని ఆదేశించేవారని విశ్లేషకులు చెబుతున్నారు.

పర్యటనల్లో కానరాని జనం

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేపడుతున్న జిల్లాల పర్యటనల్లో జనం పెద్దగా ఆదరించడంలేదనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఆమెతో వెళ్లే నాయకులు మినహా కనీసం 50 మంది కూడా రావడంలేదు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతున్నా ఇంత తక్కువ జనం రావడం ఆమెకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిరుద్యోగ సమస్య కాబట్టి కనీసం యువకులు కూడా రాకపోవడం గమనార్హం. జనసమీకరణలో నేతలు సైతం ఫెయిలైనట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు పార్టీలో సరైన గుర్తింపు లేక కూడా నేతలు చురుకుగా పనిచేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

చేరికలపై స్పష్టత కరువు

పార్టీ ఏర్పాటు సమయంలో వైఎస్సార్ టీపీలో చేరికలపై తొలుత భారీ ఎత్తున ప్రచారాలు జరిగాయి. వైఎస్సార్ అభిమానులు, నాయకులు, రెడ్డి వర్గీయులు, దళిత వర్గానికి చెందిన నాయకులంతా వైఎస్సార్ టీపీకి క్యూ కడుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పార్టీ ఆవిర్భావం రోజున కూడా ఎంతో మంది నేతల చేరికలుంటాయని లోటస్ పాండ్ వర్గీయులు ప్రచారం చేశారు. ఆ రోజు చేరే వారికి ఆవిర్భావ వేడుకల్లోనే కండువాలు కప్పాలని తొలుత నిర్ణయించారు.

అయితే షర్మిల బేగంపేట నుంచి ర్యాలీగా జేఆర్ సీ కన్వెన్షన్ కు వచ్చిన సమయంలోనూ, హాల్ లోనూ తక్కువ జనం రావడంపై నేతలపై మండిపడినట్లు తెలుస్తోంది. అందుకే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి కూడా ఆ పార్టీలో గతంలో చేరిన నేతలు తప్పా కొత్తగా చేరికలు మాత్రం జరగడంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే షర్మిల రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Next Story

Most Viewed