రాఫెల్ డీల్ కోసం మధ్య దళారికి భారీ ‘గిఫ్ట్’?

by  |
రాఫెల్ డీల్ కోసం మధ్య దళారికి భారీ ‘గిఫ్ట్’?
X

న్యూఢిల్లీ: ఫ్రెంచీ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్‌తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఆ డీల్ వివాదాల్లోనే నానింది. మోడీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ డీల్‌ను ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఆరోపణల వెల్లువల మధ్యలోనే కొన్ని యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాయి. వచ్చే ఏడాదిలోపు అన్ని 36 జెట్లు భారత్‌కు రానున్నాయి. ఈ తరుణంలో తాజాగా, రాఫెల్ యుద్ధ విమానాల తయారీదారుకు సంబంధించిన అవినీతి కోణం వెలుగుచూసింది. భారత్‌తో రాఫెల్ డీల్ కుదిరిన వెంటనే మనదేశానికి చెందిన ఓ దళారికి భారీ ‘గిఫ్ట్‌’ను చెల్లించిందనీ తాజాగా ఓ ఫ్రెంచీ మీడియా సంస్థ ప్రచురించింది. 10 లక్షల యూరోల(రూ. 8.62 కోట్లు)ను భారత్‌కు చెందిన డస్సాల్ట్ సబ్‌కాంట్రాక్టు కంపెనీ డెఫ్‌సిస్ సొల్యూషన్స్‌కు ఇచ్చినట్టు ఫ్రాన్స్ అవినీతి నిరోధక అధికారుల(ఏఎఫ్ఏ) దృష్టికి వచ్చింది. ఇందులో సగం మొత్తాన్ని(508,925 యూరోలు) డస్సా్ల్ట్ సంస్థ తన చిట్టాల్లో ‘క్లయింట్లకు గిఫ్ట్’ పేర్కొంది. డస్సాల్ట్ సంస్థలో ఏఎఫ్ఏ ఆడిట్ నిర్వహిస్తుండగా ఈ విషయం బయటకు వచ్చినట్టు మీడియాపార్ట్ ప్రచురించింది.

‘గిఫ్ట్‌’పై డస్సాల్ట్ సమాధానం

భారీ మొత్తంలో గిఫ్ట్ ఇవ్వడంపై ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నించగా, డస్సాల్ట్ సమర్థించుకునేందుకు ప్రయత్నించిందని కథనం పేర్కొంది. రాఫెల్ విమానాల రెప్లికా మాడల్ తయారీ కోసం భారత్‌కు చెందిన డెఫ్‌సిస్ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, కారు సైజులో 50 రాఫెల్ విమానాల మాడల్స్‌ను ఆ కంపెనీ నుంచి తీసుకున్నామని డస్సాల్ట్ సమాధానమిచ్చింది. 1,017,850 యూరోల్లో సగం ఈ మాడల్స్‌కు చెల్లించామని పేర్కొంది. కాగా, 508,925 యూరోలను గిఫ్ట్‌గా పేర్కొంది. ఆ రెప్లికా మాడల్స్‌ను తయారుచేసినట్టు లేదా స్వీకరించినట్టు డస్సాల్ట్ చూపించలేకపోయిందని ఆ కథనం పేర్కొంది. కనీసం ఫొటోనైనా చూపించలేకపోయిందని, స్వయంగా తయారుచేస్తున్న యుద్ధ విమానానికి మాడల్‌ను తయారుచేయడానికి భారత సంస్థకు ఆర్డర్ ఇవ్వడమేమిటనీ అడిగిన ప్రశ్నకు సంతృప్తికర సమాధానం రాలేదని వివరించింది. గిఫ్ట్ అని రాయడానికి గల కారణాలనూ వివరించలేకపోయిందని రిపోర్ట్ చేసింది.

డెఫ్‌సిస్ సొల్యూషన్స్ ఎవరిది?

డస్సాల్ట్ ఏవియేషన్ తన సబ్ కాంట్రాక్టర్‌గా పేర్కొన్న భారత సంస్థ డెఫ్‌సిస్ సొల్యూషన్స్ బిజినెస్ మ్యాన్ సుషేన్ గుప్తాకు చెందినది. సుషేన్ గుప్తాకు జైలుకెళ్లిన చరిత్ర ఉండటం గమనార్హం. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ కేసులో ఈడీ దర్యాప్తులో గుప్తా జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆగస్టా చాపర్‌ల కొనుగోళ్ల సమయంలో మనీలాండరింగ్ స్కీమ్‌కు ప్రణాళికలు వేసినట్టు గుప్తాపై ఆరోపణలున్నాయి.

Next Story

Most Viewed