దాడి చేస్తున్న మిడతల ముచ్చట గిదీ!

by  |
దాడి చేస్తున్న మిడతల ముచ్చట గిదీ!
X

ఉత్తర భారతదేశ రైతులకు మిడత గుంపుల దాడి పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా మిడతలు గోధుమ, జొన్న వంటి పంటల మీద పడి నిమిషాల వ్యవధిలో నాశనం చేస్తున్నాయి. ఏదో వర్షం వచ్చినట్టుగా వచ్చి నరకం చూపిస్తున్నాయి. అయితే ఇవి ఇప్పుడే వచ్చాయా? గతంలో ఇలా ఎప్పుడైనా దాడి చేశాయా? ఇవి ఎందుకు వస్తున్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానం చాలా మందికి తెలియదు. ఆ మిడతల కథాకమామీషు మీకోసం!

ఎడారి మిడత అంటే?

ఈ ఎడారి మిడతలు గొల్లభామల్లో ఉన్న 12 రకాల్లో ఒక రకం. చిన్నచిన్న కొమ్ములు కలిగి ఉండి, ఇవి ఒంటరిగా ఉన్నపుడు పెద్ద ప్రమాదం కాదు, కానీ గుంపులుగా మారాయంటే మాత్రం తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఒక చిన్న ఎడారి మిడతల గుంపు ఒక్కరోజులో 2500 మందికి సరిపోయే ఆహారాన్ని తినగలవు.

భారతదేశంలో కనిపించే రకాలు

దాదాపు 12 రకాల మిడతల్లో భారతదేశంలో ముఖ్యంగా నాలుగు రకాల మిడతలు ఉన్నాయి. అవి ఎడారి మిడతలు, వలస మిడతలు, బాంబే మిడతలు, ట్రీ మిడతలు.

మనదేశానికి ఎలా వచ్చాయి?

పాకిస్థాన్‌లో సంతానాన్ని వృద్ధి చేసుకుని రాజస్థాన్ మీదుగా ఈ ఎడారి మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి.

గతంలో జరిగాయా?

గడిచిన రెండు శతాబ్దాల్లో చాలా సార్లు ఇలాంటి మిడతల దాడి జరిగింది. కానీ అవన్నీ చిన్న చిన్నవే. 1998, 2002, 2005, 2007, 2010ల్లో పరిమిత ప్రాంతాల్లో ఈ మిడతల దాడి జరగగా.. వాటిని ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. మొదటిసారిగా 1812లో ఈ మిడతల దాడి జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.

నియంత్రించే పద్ధతులు

ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా వీటి కోసమే మిడతల నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. ఏప్రిల్ 11 నుంచి ఈ కేంద్రాల సిబ్బంది, జిల్లా అధికారులు, రాష్ట్రాల అధికారులతో కలిసి 50 స్ప్రే పరికరాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. వీటి కట్టడి కోసం ట్రాక్టర్‌కు తగిలించిన స్ప్రేయర్లు, ఫైర్ టెండర్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. రోజురోజుకీ మిడతల దాడి పెరుగుతుండటంతో అదనపు పరికరాలను కూడా తెప్పిస్తున్నారు.

దారుణ పరిస్థితి

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస కీటకంగా ఈ ఎడారి మిడతను పరిగణిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న దాడి కారణంగా భారత వ్యవసాయరంగానికి తీవ్రనష్టం వాటిల్లడమే కాకుండా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ప్రాథమిక రంగం కుంటుపడటం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా నష్టం ఎదుర్కోక తప్పని పరిస్థితి.


Next Story

Most Viewed