దళిత బంధు‌ గైడ్‌లైన్స్‌లో ట్విస్ట్.. ఇవి ఉంటే మీరు అనర్హులు.!

by  |
dalitha bandhu telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు పథకంపై సీఎం మాటలకు.. అధికారుల కార్యాచరణకు పొంతన కుదరటం లేదు. హుజూరాబాద్​ సభలో ఉద్యోగులు కూడా అర్హులేనని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అర్హతకు సంబంధించిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించింది. వాటి ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది.

ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే ఇప్పుడు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్​ తదితర శాఖల సిబ్బంది హుజూరాబాద్‌లో శుక్రవారం నుంచి సర్వే చేపట్టనున్నారు. మొత్తం 48 ప్రశ్నలతో దాదాపు 400 మందికిపైగా సిబ్బంది సర్వేలో పాల్గొంటారు. 4 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలకు, హుజూరాబాద్ సెగ్మెంట్​లోని సుమారు 23 వేల కుటుంబాలకు ‘దళితబంధు’కింద రూ. 10 లక్షల చొప్పున సాయం చేయనున్నట్టు సీఎం పేర్కొన్నారు.

ఈ మేరకు వాసాలమర్రి గ్రామానికి రూ. 7.60 కోట్లు, హుజూరాబాద్‌కు రూ. 1200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మార్గదర్శకాల ప్రకారం జరగనున్నది. సీఎం చెప్పినదానికీ, ప్రభుత్వ ఉత్తర్వులకు భారీ తేడా ఉండటం సర్వే సిబ్బందిని అయోమంలో పడేస్తున్నది.

అందరికీ అంటూనే సర్వే..

సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు మాత్రమే కాక రాష్ట్రమంతటా దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధును అమలు చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం మార్గదర్శకాలను జారీ చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ మార్గదర్శకాల వెలుగులోనే సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సర్వేపై దిశానిర్దేశం చేశారు.

అందరికీ దళితబంధు వర్తిస్తున్నప్పుడు ఇక సర్వే చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న దళితులు ఇప్పుడు నాలుగైదు రోజుల పాటు నిర్వహించే సర్వేతో అయోమయంలో పడ్డారు. సర్వే విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఇలాంటి గందరగోళమే నెలకొన్నది.

మార్గదర్శకాల్లో ఏముంది..?

ప్రభుత్వం జారీ చేసిన 8 మార్గదర్శకాల్లో దళితబంధు పథకానికి అర్హులెవరో స్పష్టమవుతుంది.
1. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు.
2. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి విభాగం రూపొందించిన జీవో నెం. 5 ప్రకారం దళిత కమ్యూనిటీకి చెందినవారు మాత్రమే అర్హులు.
3. కుటుంబ మొత్తం వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు మించరాదు.
4. ఆ కుటుంబానికి రెండున్నర ఎకరాల మాగాణి భూమి లేదా మెట్టతో కలుపుకొని మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉండొద్దు
5. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. కేంద్ర ప్రభుత్వరంగ లేదా రాష్ట్ర ప్రభుత్వరంగ ఉద్యోగులై ఉండవద్దు
6. ఆ కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యగులు ఉండొద్దు.
7. కుటుంబం మొత్తానికి పది గుంటలకు మించి నివాస స్థలం ఉండరాదు.
8. కుటుంబానికి వ్యక్తిగతంగా ఫోర్ వీలర్ (క్యాబ్ సర్వీసుదైతే ఫర్వాలేదు) ఉండరాదు.

లబ్ధిదారులను గుర్తించేదెలా?

దళితబంధు పథకానికి లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుంది. స్వయంగా జిల్లా కలెక్టర్ అన్ని గ్రామాలు, వార్డులను ఈ కమిటీలను ఏర్పాటుచేసి దళిత వాడల్లో సర్వే చేయిస్తారు. మండలస్థాయిలో ఆ మండల అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అన్ని గ్రామాలకు ఇలాంటి కమిటీలు ఏర్పాటవుతాయి.

నిర్దిష్ట పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, గ్రామ ఆర్గనైజేషన్ సభ్యుడు, దళితబంధు రిసోర్స్ పర్సన్ ఆ గ్రామానికి/వార్డుకు సంబంధించిన కమిటీలో సభ్యులుగా ఉంటారు. మార్గదర్శకాల్లో పేర్కొన్న అర్హతల ప్రకారం గ్రామం/వార్డుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది.

ఇక మండల స్థాయిలో దళితబంధు పథకాన్ని పటిష్టంగా అమలుచేయడానికి ఎంపవర్‌మెంట్ కమిటీ ఆ మండలానికి చెందిన ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ చైర్మన్‌గా కమిటీ పనిచేస్తుంది. మండల/మున్సిపాలిటీ దళితబంధు రిసోర్స్ పర్సన్, ఎమ్మార్వో, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ అధికారి, ఏపీఎం, క్లస్టర్ కోఆర్డినేటర్లు, పశు సంవర్థక శాఖ అధికారి, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఇందులో సభ్యులుగా ఉంటారు.

లబ్ధిదారులకు శిక్షణ ఎలా.?

లబ్ధిదారుల ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున అందే రూ. 10 లక్షలను జీవనోపాధి పెంపునకు ఎలా వాడుకోవాలో కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒక కమిటీ పనిచేస్తుంది. కలెక్టర్ చైర్మన్​గా ఎంపవర్‌మెంట్ కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కన్వీనర్‌గా ఉంటారు. ఎస్సీ సంక్షేమ అధికారి, డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీ, డీపీవో, డీఏవో, జిల్లా పశుసంవర్ధక అధికారి, జిల్లా రవాణా అధికారి, సీటీవో, హార్టికల్చర్/సెరికల్చర్ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, నాబార్డు జనరల్ మేనేజర్ లాంటి మరికొద్దిమంది సభ్యులుగా ఉంటారు.

లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న అంశాల్లో, ఎంపిక చేసుకున్న వృత్తి/వ్యాపారంలో అవసరమైన మెళకువలను ఈ కమిటీ తరఫున ఆయా విభాగాల్లో అనుభవజ్ఞలు శిక్షణ ఇస్తారు. లబ్ధిదారులుగా ఎంపికైనవారికి ప్రభుత్వం తరఫున సాయం అందిన తర్వాత వారు నిలదొక్కుకునేంత వరకు జిల్లాస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. అవసరమైన సహాయ సహకారాలను అందిస్తారు. లబ్ధిదారులకు అవసరమైన వ్యాపారం/వృత్తికి సంబంధించిన డీపీఆర్ తయారీ, శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్ తదితరాల్లో తోడ్పడుతారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల డీపీఆర్‌లపై జిల్లా స్థాయిలో దళితబంధు ఎంపవర్‌మెంట్ కమిటీలు దరఖాస్తులను పరిశీలించడం, ఆర్థిక సాయాన్ని మంజూరు చేయడం, వారి యూనిట్ ఏ విధంగా పనిచేస్తున్నదో పర్యవేక్షిస్తూ ఉంటాయి. శిక్షణ కాలంలో ప్రతి నెలా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మాట్లాడుతాయి.

దళిత రక్షణ నిధి కోసం సొసైటీ ఏర్పాటు..

ప్రతి లబ్ధిదారుడు రూ. 10 వేల చొప్పున రక్షణ నిధికి సమకూరిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఈ నిధి కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు సభ్యులైన దళిత కుటుంబాలకు దీని నుంచి సాయం అందుతుంది. ఇందుకోసం దళిత రక్షణ నిధిని ఒక సొసైటీగా కలెక్టర్ రిజిస్టర్​ చేయిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి, కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా పరిషత్ సీఈవో, డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, డీపీవో, డీపీఆర్​వో, జిల్లా ఆడిట్ అధికారి ఇందులో సభ్యులుగా ఉంటారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దీనికి ట్రెజరర్‌గా వ్యవహరిస్తారు.

సర్వే బృందాలకు ప్రశ్నావళి..

లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామస్థాయిలో సర్వే జరిపే ప్రభుత్వ సిబ్బందితో కూడిన బృందాలు మొత్తం 48 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తాయి. పేరు, ఊరు, మండలం, జిల్లా, కుటుంబంలో సభ్యుల సంఖ్య, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ఎస్సీలో ఉప కులం, ఇప్పటికే ఏదేని దళిత పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారా? ఎంత మొత్తంలో ఆర్థిక సాయం పొందారు? దాని ద్వారా నెలకు ఎంత ఆదాయం ఇప్పుడు ఆర్జిస్తున్నారు? ఎంత రెవెన్యూను ఇప్పటివరకు ఆర్జించారు? నెలకు ఎంత ఖర్చవుతున్నది.

వ్యాపారమైనట్లయితే లాభాల్లో ఉన్నదా లేక నష్టాలు వస్తున్నాయా? నికరంగా ఆదాయం ఎంత వస్తున్నది లాంటి వివరాలను సేకరిస్తారు. ఇక దీనికి అదనంగా ప్రతీ నెలా ఏయే అవసరాలకు ఆ కుటుంబం ఎంత ఖర్చు పెడుతున్నది కూడా సేకరిస్తాయి. ఆహారపు అవసరాలకు ఎంత ఖర్చవుతున్నది, బట్టలు/ఇతర వస్తువులకు, ఇంటిలోని పనిముట్లు/గృహోపకరణాలకు, రవాణాకు, పెట్రోలు/డీజిల్ తదితరాలకు, పిల్లల చదువులకు, వైద్యారోగ్యం, ఇతర రకాల అవసరాలకు నెలకు ఎంత ఖర్చవుతున్నదో ఆరా తీస్తాయి.

ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, ప్రభుత్వ వైద్య పథకాల ద్వారా పొందుతున్న లబ్ధి, ఇంట్లో ఏ వయసువారు ఎంత మంది ఉన్నారు, పిల్లలు ఏయే తరగతులు చదువుతున్నారు, ఎంత మంది స్కూలుకు వెళ్లటం లేదు, ఎందుకు వెళ్లడం లేదు, ఎన్ని స్కూళ్లు మార్చారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి తదితర వివరాలను కూడా సేకరిస్తాయి.

ఇక ఇంటి అవసరాల కోసం ప్రతి నెలా వంట గ్యాసుకు, కరెంటుకు ఎంత ఖర్చు అవుతున్నది, ఎన్ని సిలిండర్లు వాడుతున్నది, ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతున్నది, కరెంటు కనెక్షన్ ఎప్పుడు తీసుకున్నది, ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉన్నదా? ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇంట్లో ఎలాంటి వాహనాలు (బైక్, ఆటో, క్యాబ్ కారు) వాడుతున్నారు? ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇంట్లో టీవీ/ఫ్రిజ్, వాషింగ్ మెషీన్/గ్రైండర్ లాంటివి ఉన్నాయా, బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదా, నెలకు ఎంత ఖర్చవుతున్నది.. ఇలాంటి అంశాలనూ ఈ సర్వే బృందాలు సేకరిస్తాయి.



Next Story

Most Viewed