భారీ నష్టాలు నమోదు చేసిన మార్కెట్లు

by  |
భారీ నష్టాలు నమోదు చేసిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వరుస లాభాలతో జోరుగా ఉన్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. జీడీపీ గణాంకాలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రారంభ లాభాల కారణంగా సెన్సెక్స్ ఓ దశలో 40 వేల మార్కును దాటినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో సూచీలు దిగజారాయి.

చైనాతో ఉన్న వివాదం కారణంతో పాటు, జీ20 దేశాల్లో భారత్ అత్యల్ప వృద్ధిరేటును నమోదు చేస్తుందన్న ఆర్థిక నిపుణుల అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. వీటితో పాటు ఆర్థిక గణాంకాల్లో అస్పష్టత వల్ల మదుపర్లలో సెంటిమెంట్ బలహీనపడిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 839.02 పాయింట్లు కోల్పోయి 38,628 వద్ద ముగియగా, నిఫ్టీ 260.10 పాయింట్లు నష్టపోయి 11,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ (ONGC), టీసీఎస్ (TCS) షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి.

అత్యధికంగా సన్‌ఫార్మా (Sun pharma), ఎస్‌బీఐ (SBI), బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance), ఎన్‌టీపీసీ (NTPC), ఐసీఐసీ బ్యాంక్ (ICICI Bank), కోటక్ బ్యాంక్ (Kotak Bank), ఎంఅండ్ఎం (M&M), మారుతీ సుజుకి (Maruti Suzuki), ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), ఆల్ట్రా సిమెంట్ (Ultra cement), ఎల్అండ్‌టీ (L&T), ఏషియన్ పెయింట్ (Asian paint), టాటా స్టీల్ (Tata Steel), టైటాన్ (Titan) షేర్లు నష్టపోయాయి.


Next Story