గెట్ రెడీ ఫర్.. సైబర్‌పంక్ 2077

by  |
గెట్ రెడీ ఫర్.. సైబర్‌పంక్ 2077
X

దిశ, వెబ్‌డెస్క్ : గేమర్‌లు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘సైబర్‌పంక్ 2077 గేమ్’ డిసెంబర్ 10వ తేదీన విడుదలకానుంది. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరాఖరికు డిసెంబర్ 10న దీని విడుదలకు ముహూర్తం కుదిరింది. అయితే ఈ గేమ్‌లో ‘వీ’ అనే క్యారెక్టర్‌లో మీరు మమేకమై ఆడటానికి ముందు, ఈ సైబర్‌పంక్ 2077 గేమ్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సైబర్‌పంక్ 2077 గేమ్ విడుదల ఇప్పటికే మూడుసార్లు డిలే అయింది. దీంతో గేమర్లు కోపంతో సైబర్‌పంక్ డెవలపర్లను ట్విట్టర్ వేదికగా బెదిరించిన విషయం కూడా అప్పట్లో వైరల్ అయింది. మొత్తానికి డిసెంబర్ 10న ఈ గేమ్ విడుదలకానుంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌లు కూడా ఓపెన్ అయ్యాయి.

టెక్నికల్‌గా ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, మైక్రోసాఫ్ట్ విండోస్, గూగుల్ స్టేడియాలతో పాటుగా నెక్స్ట్ జెనరేషన్ గేమింగ్ కన్సోల్స్ అయిన ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ గేమ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పర్ఫ్మార్మెన్స్ కోసం సిఫార్సు చేసిన పీసీ రిక్వైర్‌మెంట్స్ ఏంటంటే.. 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డైరెక్ట్ఎక్స్ 12 వెర్షన్, ఇంటెల్ కోర్ ఐ7-4790 లేదా ఏఎండీ రైజెన్ 3 3200జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, ఎన్‌విడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1060 6 జీబీ లేదా ఏఎండీ రేడియాన్ ఆర్9 ఫ్యూరీ గ్రాఫిక్స్ కార్డ్, 70 జీబీ స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్‌పంక్ 2077ను ఎంజాయ్ చేయవచ్చు.

సైబర్‌పంక్ 2077 అనేది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ రోల్ ప్లేయింగ్ గేమ్. దీని గురించి 2012లో ప్రకటించారు. దీన్ని సీడీ ప్రాజెక్ట్ రెడ్ రూపొందించింది. ఉత్తర కాలిఫోర్నియాలోని డిస్టోపియన్ ఫ్యూచర్‌లో ఈ గేమ్ నడుస్తుంది. ఇక్కడ డిస్టోపియన్ ఫ్యూచర్ అంటే దారుణంగా ఉండే భవిష్యత్తు అని అర్థం. ఈ సిటీలో పెద్ద కంపెనీల గుత్తాధిపత్యం సాగుతుంటుంది. అలాగే రోజువారీ పనుల్లో టెక్నాలజీ ప్రధాన భాగం పోషిస్తుంటుంది. ఇక్కడి నైట్ సిటీలోని లంచగొండితనం, అక్రమాల చుట్టూ ఈ గేమ్ కథ నడుస్తుంది. ఇందులో గేమ్ ఆడేవారు ‘వీ’ అనే పాత్రలో కనిపిస్తారు. మిషన్‌లు పూర్తిచేస్తూ, స్ట్రీట్ క్రెడ్ సంపాదించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ఆయుధాలను, సైబర్‌నేటిక్స్‌ను అప్‌డేట్ చేసుకుంటుండాలి. గేమ్‌ను మొదటగా ఒంటరిగానే ప్రారంభించాలి, కొన్ని ప్రారంభ మిషన్‌ల అనంతరం ఒక విప్లవకారుడు జానీ సిల్వర్‌హ్యాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ పాత్ర పోషించింది హాలీవుడ్ నటుడు కియాను రీవ్స్ అని అందరికీ తెలుసు. ఆ పాత్రతో ‘వీ’ కలిసి పనిచేస్తూ, పంక్ విప్లవాన్ని వ్యాప్తి చేయాలి.

నైట్ సిటీలో సిటీ సెంటర్, వాట్సన్, వెస్ట్‌బ్రూక్, హేవుడ్, పసిఫికా, శాంటో డొమింగో అనే ఆరు డిస్ట్రిక్ట్‌లు ఉంటాయి. సిటీ సెంటర్‌లో పెద్ద పెద్ద కార్పొరేషన్‌లు, విలాసమైన అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. వాట్సన్‌లో ఆసియా నుంచి వలస వచ్చి చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్లు ఉంటారు. వెస్ట్‌బ్రూక్‌లో జపాన్ నుంచి వలస వచ్చి కష్టపడి పనిచేసి, బాగా డబ్బు సంపాదించిన వాళ్లు ఉంటారు. హేవుడ్‌ అనేది ఒక సబ్ అర్బన్ ఏరియా, ఇక్కడ గ్యాంగ్ సమస్య ఉంటుంది. పసిఫికా అనేది సిటీలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం, పూర్తిగా గ్యాంగ్‌ల కార్యకలాపాలు ఇక్కడే జరుగుతాయి. శాంటో డొమింగోలో అన్ని పవర్ ప్లాంట్‌లు, పరిశ్రమలు ఉంటాయి.

నైట్‌ సిటీలో ముఖ్యంగా ఎనిమిది పేరున్న గ్యాంగ్‌లు ఉంటాయి. ఆ గ్యాంగ్‌ల పేర్లు… సిక్స్త్ స్ట్రీట్, యానిమల్స్, మేల్ స్ట్రోమ్, ద మాక్స్, స్కావెంజర్స్, టైగర్ క్లాస్, వాలెంటినోస్, వూడూ బాయ్స్. ఒక్కో గ్యాంగ్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సిక్స్త్ స్ట్రీట్‌లో 4వ కార్పొరేట్ వార్‌లో పాల్గొన్న వారు ఉండగా, యానిమల్స్‌లో సైబర్‌వేర్‌ను ద్వేషించే బాడీ బిల్డర్లు ఉంటారు. అలాగే మేల్‌స్ట్రోమ్‌లో సైబర్‌వేర్‌ను అమితంగా ఇష్టపడే వాళ్లు ఉంటే, ద మాక్స్‌లో వేరే గ్రూప్‌లలో స్థానం దక్కని వారు ఉంటారు. ఇక స్కావెంజర్స్, ప్రజల్ని కిడ్నాప్ చేసి సైబర్‌వేర్ దొంగతనం చేసే వాళ్లు కాగా, టైగర్ క్లాస్‌లో ఇల్లీగల్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ ఓనర్లు ఉంటారు. వాలెంటినోస్ అనేవారు నిజాయితీ గల ఫ్యామిలీ గ్యాంగ్. వూడూ బాయ్స్ గ్యాంగ్‌లో హ్యాకింగ్ నిపుణులు ఉంటారు.

ఈ గేమ్ ప్రధాన పాత్రధారి పేరు ‘వీ’. నైట్ సిటీలో తిరిగే ఒక పాత్ర. అయితే ‘వీ’ ఎలా ఉండాలి? ఏం చేయాలి అనేది ఆడే వ్యక్తి నిర్ణయించాలి. ఎలా చేసినా చివరికి జానీతో కలిసి పెద్ద కార్పొరేషన్‌లకు వ్యతిరేకంగా పోరాడి, నైట్ సిటీ మీద ఆధిపత్యం దక్కించుకోగలగాలి. జానీ సిల్వర్‌హ్యాండ్ అనే వ్యక్తి నైట్ సిటీలో ఉండే ఒరిజినల్ రాకర్‌బాయ్. 21వ శతాబ్దం ప్రారంభంలో కార్పొరేషన్‌ల మీద విప్లవాన్ని ప్రకటిస్తాడు. మళ్లీ 2077లో కేవలం ‘వీ’ కి మాత్రమే కనిపించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొజెక్షన్‌గా ఎంట్రీ ఇస్తాడు. మరో విప్లవం తీసుకురావడానికి జానీ సిల్వర్‌హ్యాండ్, ‘వీ’ కి ఒక మార్గదర్శకునిలాగ పనిచేస్తాడన్నమాట. అయితే ఈ గేమ్‌ను ప్రస్తుతానికి సింగిల్ ప్లేయర్ గేమ్‌గా విడుదల చేశారు. కానీ త్వరలోనే దీన్ని మల్టీ ప్లేయర్‌గా మారుస్తామని సీడీ ప్రాజెక్ట్ రెడ్ ప్రకటించింది కానీ ఎప్పుడు అనే విషయం గురించి స్పష్టత లేదు.


Next Story