మిత్రుని గుండె కోసేసిన హరి.. నవీన్ మర్డర్ కేసులో వెలుగులోకి విస్తూపోయే నిజాలు!

by Disha Web Desk 19 |
మిత్రుని గుండె కోసేసిన హరి.. నవీన్ మర్డర్ కేసులో వెలుగులోకి విస్తూపోయే నిజాలు!
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి ఎక్కడ దక్కుతుందోనన్న అనుమానంతో పార్టీ పేరుతో పిలిచి ఫ్రెండ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (20) నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ఫైనలియర్ చదువుతున్నాడు.

అయితే, అదే కళాశాలలో చదువుతున్న హరి, నవీన్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూమ్‌కు నేనావత్ నవీన్‌ను హరి ఆహ్వానించాడు. పార్టీలో ఇద్దరికీ గొడవ జరగగా.. తను ప్రేమించే యువతితో నవీన్ క్లోజ్‌గా ఉండటాన్ని హరి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నవీన్‌ను అతికిరాతకంగా హతమార్చాడు.

నవీన్ మృతదేహాం నుండి చేతి వేలు, తల, గుండె వేరుచేసి గుట్టల్లో పడేసినట్లు సమాచారం. హత్య అనంతరం నవీన్ వేలు కోసి.. ఇదే కదా నిన్ను తాకిన వేలు అంటూ ఫొటోను హరి తన ప్రియురాలికి పంపించినట్లు సమాచారం. అయితే, దీనికి సదరు యువతి కూడా గుడ్ బాయ్ అంటూ రిప్లే ఇవ్వడం గమనార్హం. అయితే, నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్ పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి విచారణ జరిపించారు.

కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే అసూయతోనే నవీన్‌ను విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని, మృతదేహాన్ని అబ్దుల్లాపూర్ మెట్ శివారులోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పడేశానని నిందితుడు హరి పోలీసులకు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, విషయం తెలుసుకున్న నవీన్ కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Next Story

Most Viewed