ఓరుగల్లుకు నెత్తుటి మరకలు!

by  |
ఓరుగల్లుకు నెత్తుటి మరకలు!
X

దిశ, వరంగల్ :
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన ‘ఓరుగల్లు’ సంచనాలకు కేంద్రంగా మారుతోంది. చారిత్రక నేపథ్యమున్న వరంగల్ నగరంలో క్రైమ్ గ్రాఫ్ పెరిగిపోతోంది. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందో? ఎలాంటి చెడువార్తలు వినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు హత్యలు నగరంలోని అన్ని వర్గాలను భయాందోళనలకు గురిచేశాయి. ఈ వరుస హత్యలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండు ఘటనల్లోనూ నిందితులు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇస్తామని నమ్మబలికి అమాయకులను అతి కిరాతకంగా అంతమొందించారు. దీనికితోడు గడిచిన వారం రోజుల్లో మహిళలపై అత్యాచార ఘటనలకు సంబంధించిన వార్తలు నగరవాసుల ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు.. చిన్నారులు, వృద్ధులపైనా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం విస్మయానికి గురిచేస్తోంది.

రెండు రోజుల కిందట నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని రుద్రగూడెం ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మరుసటి రోజు ఆ మైనర్ బాలిక దుగ్గొండి మండలానికి చెందిన మైనర్ బాలుడిని లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు వాట్సప్‌లో ఫోటో పోస్ట్ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వరంగల్ ఉమ్మడి జిల్లాను సైతం కుదిపేసింది. ఇటీవల జనగామ జిల్లా, లింగాలఘణపురం మండలానికి చెందిన వ్యక్తి జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి తిరిగి వచ్చాడు. అతడు దగ్గు, జలుబుతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి రాగా.. పలు టీవీ ఛానళ్లు అతడికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు ప్రసారం చేయడం ఆందోళనకు గురిచేసింది.

వరుస ఘటనలతో కలకలం..

రెండు దశాబ్దాల కిందట వరంగల్ జిల్లాలోని పరిస్థితులు వేరు. అప్పట్లో పీపుల్స్ వార్, పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్లతో ఏజెన్సీ పల్లెలన్నీ గడగడలాడేవి. జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాకేంద్రంగా రౌడీల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఆధిపత్యపోరులో భాగంగా ప్రత్యర్థుల తల, మొండెం వేరు చేసేంత క్రూరమైన హత్యలు జరిగాయి. దీంతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠినచర్యలు తీసుకుని రౌడీల ఆగడాలను తగ్గించారు. కానీ, 2009లో ప్రేమపేరుతో ముగ్గురు యువకులు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఘటనను మహిళాలోకం తీవ్రంగా ఖండించింది. అయితే, కొద్దిరోజుల్లోనే సదరు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్లో హతమయ్యారు. ఇక 2012లో జిల్లాలో చైన్‌స్నాచర్లు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అప్పట్లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత చిన్నాచితకా నేరాలు జరిగినప్పటికీ చాలాకాలంగా నగరంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి.

ఈ ఏడాది ఆరంభం నుంచి జరుగుతున్న వరుస ఘటనలు మళ్లీ జిల్లావాసులను కలవర పెడుతున్నాయి. హన్మకొండలో పసిపాపపై మృగాడి అత్యాచారం, హత్య, ఆ తర్వాత ప్రేమపేరుతో ఇద్దరు యువతుల హత్యోదంతాలు జనాలను ఉలిక్కిపడేలా చేశాయి. జిల్లాలో ఎక్కడో ఒకచోట చిన్నారులు, మానసిక వికలాంగులపై అత్యాచారాల వార్తలు నిత్యం ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అమానవీయ ఘటనల నుంచి జనం తేరుకుంటున్న తరుణంలోనే వారం వ్యవధిలో జరిగిన జర్నలిస్ట్ సునీల్ రెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డిల వరుస హత్యలు మరోసారి నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోలీస్ శాఖ సరైన రీతిలో స్పందించని కారణంగానే నేరాలు జరుగుతున్నాయనే ఆరోపణలు నగరవాసుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

tags : Greater Warangal, Crime rate, Serial Murders, Financial issues

Next Story

Most Viewed