‘హైటెక్‌’లో ఆకట్టుకున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో

by  |
‘హైటెక్‌’లో ఆకట్టుకున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో
X

దిశ, శేరిలింగంపల్లి: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్ ) 10వ ఎడిషన్ ప్రాపర్టీ షో మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రెండవ రోజు మరింత ఉత్సాహంగా కొనసాగింది. క్రెడాయ్ ప్రాపర్టీ షోకూ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. శనివారం పెద్ద ఎత్తున సందర్శకులు తరలిరావడంతో అన్ని స్టాల్స్ వినియోగదారులతో కలకలలాడాయి. స్టాల్స్ అన్ని పరిశీలిస్తూ ఒక్కో రియల్ ఎస్టేట్ బ్రోచర్ సేకరిస్తూ వెంచర్ వివరాలు తెలుసుకుంటూ తమకు అనువైన ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కొత్త వెంచర్లు, వాటి ధరలు, తాము స్థలాలను కొనేందుకు అనువుగా ఉన్నా ప్రాంతాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ స్టాల్స్ అన్నీ కలియతిరుగుతూ ఉత్సాహంగా గడిపారు.

వినియోగదారులకు కావాల్సిన అన్ని వివరాలు సమగ్రంగా తెలియజేసేందుకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అన్ని బ్రోచర్లతో పాటు డిజిటల్ డిసిప్లేలను సైతం ఏర్పాటు చేశారు. తమ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే స్మార్ట్‌ ఫోన్‌‌లోనే అన్ని వివరాలు తెలిసేలా ఆధునిక టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో వందకు పైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నచ్చిన ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసే ఇంటికి, ప్లాట్స్‌కు వెంటనే రుణాలిచ్చేందుకు పలు బ్యాంకులు కౌంటర్లు ఏర్పాటు చేశాయి.

అత్యున్నత ప్రమాణాలు, అధునాతన టెక్నాలజీ..

క్రెడాయ్ ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేసిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు అధునాతన టెక్నాలజీని వాడుతూ తమ వెంచర్లకు సంబంధించిన డీటెయిల్స్‌ను డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తూ తమ సేల్స్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సేల్స్ పర్సన్స్ సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ తమ వెంచర్స్‌కు సంబంధించిన వివరాలు చెబుతున్నారు. సందర్శకులు టెక్నాలజీని వాడుతూ తమకు కావాల్సిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు.

క్రెడాయ్ ప్రదర్శనతో కొత్త విషయాలు తెలుసుకున్నాం..

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొనసాగుతున్న క్రెడాయ్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మాకు అనువైన ప్రాంతాల్లో ఉన్న వెంచర్స్ వివరాలు తెలుసుకున్నాం. కేవలం రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా దాని అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యత, పెట్టుబడి అవకాశాలు ఇలా ఎన్నో విషయాలపై మంచి అవగాహన లభించింది. మరిన్ని రోజులు ఈ ప్రదర్శన కొనసాగితే బాగుంటుంది. – శ్రీనివాస్

ప్రాపర్టీ షో బాగుంది..

క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన విషయాలే కాకుండా డిజిటల్ మార్కెటింగ్‌కు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది అనే విషయాలపై ఒక అవగాహన వచ్చింది. కొత్తగా ప్లాట్స్ కొనాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఎన్నో సంస్థలు ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. క్రెడాయ్ ప్రాపర్టీ షో ఎంతో బాగుంది. – లత

Next Story