మేం ఎకరాకు రూ.50వేలు ఇస్తాం.. ఇసుక మేటలను తొలగిస్తారా? సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ సవాల్

97

దిశ, ఏపీ బ్యూరో : వరదలు, భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కర్నూలులో శుక్రవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని వర్షాలు పూర్తిగా ముంచేశాయన్నారు. మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగాయని రామకృష్ణ ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతులు చేయలేదని అందువల్లే అంత బీభత్సం జరిగిందన్నారు.

ఇసుక మేటలు వేసిన ఎకరాకు రూ.5వేలు ఇస్తామంటున్నారు. మేం ఎకరాకు రూ.50 వేలు ఇస్తాం ప్రభుత్వం చేసి చూపించాలని రామకృష్ణ సవాల్ విసిరారు. పంట రుణాలు మాఫీ చేయాలని, ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడం… రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ఆదివారం విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఏపీ ఎంపీలు ఆశించిన స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకరాలేక పోతున్నారని రామకృష్ణ ఆరోపించారు.

ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్