డయాబెటిక్ పేషెంట్స్‌కు కొవిడ్ వస్తే ?

by  |
డయాబెటిక్ పేషెంట్స్‌కు కొవిడ్ వస్తే ?
X

కొవిడ్‌తో కలిసి జీవించాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకే 100 కేసులు ఉన్నపుడు పాటించిన జాగ్రత్తలు, 1000 కేసులు నమోదవుతున్న టైమ్‌లో కొంచెమైనా పాటించట్లేదు. మరణాల రేటు తక్కువగా ఉండటం, కోలుకుంటున్న వారి రేషియో ఎక్కువగా ఉండటం వల్ల జనాల్లో భయం పోయింది. కానీ డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి అలా కాదు. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొవిడ్ సోకిన ప్రతి 10 మంది డయాబెటిక్ పేషెంట్లలో వారం తిరిగేలోపు ఒకరు చనిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

ఫ్రెంచ్ అధ్యయనం కొరనాడో

కరోనా వైరస్ సోకిన డయాబెటిక్ పేషెంట్ల మీద కొరనాడో అనే పేరుతో ఫ్రెంచ్ వైద్యులు అధ్యయనం చేశారు. కొవిడ్ నిర్ధారణ అయిన తర్వాత ఏడు రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఫ్రాన్స్‌లో ఉన్న ఆస్పత్రుల నుంచి కొవిడ్‌తో చేరిన డయాబెటిక్ పేషెంట్ల రిపోర్టులను పరిశీలించారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 మధ్య ప్రొఫెసర్ బెర్ట్రాండ్ కరియో, ప్రొఫెసర్ సామీ హజాజ్‌లు ఈ డేటాను దగ్గరుండి అధ్యయనం చేశారు. 1300 పేషెంట్లలో 89 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ (ఇన్సులిన్ ఆధారితం లేనిది), 3 శాతం మందికి టైప్ 1 డయాబెటిస్ (ఇన్సులిన్ ఆధారితం) ఉంది. వీళ్లందరి సగటు వయసు 70 సంవత్సరాలు. అలాగే అందరూ పురుషులే.

అధ్యయనం ఫలితాలు

కొరనాడో పార్టిసిపెంట్లలో జ్వరం, అలసట, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఎక్కువగా కనిపించాయి. జీర్ణక్రియ సమస్యలు తక్కువగా కనిపించాయి. ఆస్పత్రిలో చేరిన అందరు పేషెంట్లలో 20.3 శాతం మందికి ఇంట్యుబేషన్, మెకానికల్ వెంటిలేషన్ అవసరమైంది. అలాగే 10.6 శాతం మంది చేరిన రోజు నుంచి సరిగ్గా ఏడో రోజున మరణించారు. అయితే కొవిడ్ ప్రభావాలు వయసు, లింగం, గ్లూకోజ్ కంట్రోల్, అధిక రక్తపోటు వల్ల కాకుండా బాడీ మాస్ ఇండెక్స్ మీద ప్రభావం చూపించాయని అధ్యయనంలో తేలింది. కొవిడ్ కారణంగా ఆకలి వేయకపోవడంతో అలసటకు గురై, గ్లూకోజ్ స్థాయిల్లో తేడాల కారణంగా కొద్దిరోజుల్లోనే ప్రభావం కనిపించి చనిపోయే స్థితికి వచ్చారని వైద్యులు ధ్రువీకరించారు. కాబట్టి రోజువారీ పనుల్లో నిమగ్నమైనప్పటికీ కొవిడ్ 19 మనతోనే ఉందని గుర్తుంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు ఈ విషయంలో మొదటి విడత లాక్‌డౌన్ పాటించినంత జాగ్రత్తగా ఉండటమే మంచిది.

Next Story

Most Viewed