ఆగని కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడి.. చర్యలు శూన్యం

by  |
GDK-Hospitals
X

దిశ, గోదావరిఖని : కొవిడ్ మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని తలకిందులు చేసింది. వరుస లాక్‌డౌన్‌లతో ఉపాధి తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతూనే ఉన్నారు. మరోవైపు కొవిడ్ మహమ్మారి అందరి ప్రాణాలను పిండేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఏ మాత్రం కనికరం లేకుండా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. వైద్యం కోసం వచ్చే వారికి ఫీజులను పెంచి నిలువు దోపిడీ చేస్తున్నాయి.

టెస్టింగ్‌లు మొదలుకొని ట్రీట్మెంట్ వరకు అన్నింటిలోనూ అడ్డు.. అదుపు లేకుండా దోచేస్తున్నాయి. గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ కారణాలతో వేల రూపాయలను దండుకుంటున్నాయి. ఇక ఎవరైనా కొవిడ్ కారణంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే రోజుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరికొందరైతే రోగి లక్షణాలను బట్టి ప్యాకేజీలను నిర్ధారిస్తున్నాయి.

ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణీల పరిస్థితి అంతా ఇంతా కాదు. సిజేరియన్ పేరుతో 40 వేల నుంచి 60 వేల రూపాయల వరకు దండుకుంటున్నారు. ఆపైన కొవిడ్ టెస్టు, మందులు పరీక్షలకు అయ్యే ఖర్చులు రోగులకు భారంగా మారుతున్నాయి. రోగి నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో పొందుతున్నది తక్కువేమీ కాదు. స్కానింగ్‌లు తదితర వాటికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత రేట్ల కంటే ప్రస్తుత రేట్లు గర్భిణీలకు భారంగా మారుతున్నాయి. స్కానింగ్ సెంటర్‌లు సైతం తమ రేట్లను పెంచడంతో చేసేదేమి లేక రోగులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తమ వ్యాపారాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు. సాధారణ ప్రజల కంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్‌ను ఎక్కువగా చేస్తుండటంతో సాధారణ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది అయితే కేటగిరీల వారీగా రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు శూన్యం..

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎటువంటి సరైన సౌకర్యాలు, నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రిపై ఇప్పటి వరకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. కనీస నిబంధనలు పాటించకుండా వేల రూపాయలు బిల్లులు వసూలు చేస్తూ రోగుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నా.. ఇప్పటి వరకు అధికారులు ఆసుపత్రులను తనిఖీలు చేసిన పాపాన పోలేదు. ఇక మరికొన్ని ఆసుపత్రులు అయితే ఎటువంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయని ప్రచారం సైతం జోరుగా కొనసాగుతోంది.

స్కానింగ్ సెంటర్ల నిలువు దోపిడి.?

కొంతమంది స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లాలో పలు ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై స్కానింగ్ ధరలు పెంచి అందినకాడికి దండుకుంటున్నారు. కరోనాతో ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొంతమంది స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్‌గా మారి ధరలను పెంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరికొంతమంది స్కానింగ్ సెంటర్ సిబ్బంది గర్భిణీల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

నియమ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్నా ఇప్పటివరకు అటు వైపు చూసిన దాఖలాలే లేకపోవడంతో ఆయా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed