మంగళగిరి ఊపిరి పీల్చుకుంది

by  |
మంగళగిరి ఊపిరి పీల్చుకుంది
X

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో కరోనా భయంతో చేష్టలుడిగిన మంగళగిరి ఊపిరిపీల్చుకుంది. కరోనా బాధితుల రిపోర్టులు నెగిటివ్ రావడంతో ఆ ప్రాంత వాసులతో పాటు బంధువులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. వారం రోజుల క్రితం వృద్ధ దంపతులు అమెరికా నుంచి మంగళగిరి వచ్చారు.

విదేశాల నుంచి రావడంతో వారింట్లో నాలుగు రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. వారిని చూసేందుకు, అమెరికా విశేషాలు తెలుసుకునేందుకు బంధువులు వారింటికి క్యూ కట్టారు. దీంతో నాలుగు రోజుల పాటు ఆ ఇల్లు సందడి సందడిగా మారింది. ఈ సందడి సద్దమణగడంతోనే దంపతుల్లో మహిళకు జలుబు, జ్వరం సోకాయి. దీంతో ఆమెను కరోనా ఆందోళనతో ఫీవర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం తిరుపతిలోని స్విమ్స్‌కి పంపించారు. ఇంతలో ఆమె భర్త కూడా జలుబు, జ్వరంతో బాధపడుతూ అదే ఆసుపత్రిలో చేరారు. దీంతో కరోనా సోకిందన్న ఆందోళన రేగింది.

వారిద్దరినీ ఐసోలేటెడ్ రూమ్స్‌లో ఉంచారు. వారిని ఆ నాలుగు రోజులపాటు కలిసిన బంధువులందర్నీ హౌస్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మంగళగిరిలో షాపులన్నీ మూసేయించారు. రోడ్డు పక్కన పెట్టుకునే వ్యాపారాలపై ఆంక్షలు విధించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎట్టకేలకు వారికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. వారిద్దరికీ కరోనా లేదని తేల్చిచెప్పారు. దీంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు ఐదు కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో నాలుగు కేసుల్లో నెగిటివ్ వచ్చింది. మరోకరి నివేదిక రావాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ అని వచ్చిన వ్యక్తి గత ఆదివారం గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వచ్చినట్టు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో వారు అప్రమత్తమయ్యారు.

tags : coronavirus, covid-19, guntur, mangalagiri, old couple



Next Story

Most Viewed