కరోనా ఎఫెక్ట్.. జడ్జీల, లాయర్ల డ్రెస్ కోడ్ ఛేంజ్

by  |
కరోనా ఎఫెక్ట్.. జడ్జీల, లాయర్ల డ్రెస్ కోడ్ ఛేంజ్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలనూ మార్చేసింది. జడ్జీలు గానీ, లాయర్లు గానీ ఇప్పటిదాకా వేసుకునే నల్ల కోటు, మెడ చుట్టూ తెల్ల రిబ్బన్ లాంటివి ఇక ధరించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తే వెల్లడించారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త నియమాలు సుప్రీంకోర్టుకు మాత్రమే వర్తించనున్నాయి. కాలక్రమంలో అన్ని కోర్టులకూ వర్తిస్తాయి కాబోలు. ఒక కేసు విచారణను వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నల్లకోటు ధరించకుండానే కోర్టు హాల్‌లో ప్రత్యక్షమయ్యారు.

కేసు విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ప్రారంభిస్తూ, ధర్మాసనంలో కూర్చున్న ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ హృశీకేశ్ రాయ్ నల్ల కోటును ఎందుకు ధరించలేదని, నిర్దిష్టంగా ఏదైనా కారణం ఉందా అని ప్రశ్నించారు. దీనికి జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందే మాధ్యమాల్లో నల్లకోటు, రోబ్ లాంటివి కూడా ఉన్నాయని, ఆ వైరస్ బారి నుంచి తప్పించుకోడానికే వాటిని వదిలేయాల్సి వచ్చిందని కపిల్ సిబల్‌కు వివరణ ఇచ్చారు. ఇతర జడ్జీలకు కూడా నల్లకోటు లాంటివి ధరించవద్దంటూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇదే సంప్రదాయం లాయర్లకు కూడా వర్తిస్తుందని, ఇకపైన నల్లకోటు, నల్లగౌను, రోబ్ లాంటివి ధరించాల్సిన అవసరం లేదన్న సంకేతం ఇచ్చారని, త్వరలోనే ఆదేశాలు అందుతాయంటూ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను స్వయంగా కపిల్ సిబల్ ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులకు, తోటి లాయర్లకు వివరించారు.

కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మాత్రే కేసుల విచారణకు పరిమితమైన న్యాయస్థానాలు అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాయి. కోర్టు హాల్‌లో జడ్జీలు ఉంటే లాయర్లు మాత్రం వారివారి ఛాంబర్ల నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించింది. కొంతకాలం న్యాయమూర్తులు ఇళ్ళల్లోంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు చేసినా ఇప్పుడు కోర్టు హాల్‌లోకే వస్తున్నారు. గత నెలలో ఒక లాయర్ బనీను మీదనే వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరైతే న్యాయమూర్తి గట్టిగా మందలించారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇప్పుడు కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న నల్లగౌన్, నల్ల కోటు సంప్రదాయానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది సుప్రీంకోర్టు. ఆ డ్రెస్ ద్వారానే జడ్జీలను, లాయర్లను సామాన్యులు గుర్తించే వీలుండేది. ఇప్పుడు జడ్జి ఎవరో, లాయర్ ఎవరో, సామాన్యులెవరో గుర్తుపట్టలేరు.

Next Story