రాష్ట్రంలో 70వేల మందికి టీకాలు

by  |
రాష్ట్రంలో 70వేల మందికి టీకాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే దాదాపు సగం మంది ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. మంగళవారం ఒక్క రోజే 894 కేంద్రాల ద్వారా 51,997 మందికి టీకాల పంపిణీ జరిగింది. తొలి రోజు 140 కేంద్రాల ద్వారా 3,962 మందికి, రెండో రోజైన సోమవారం 334 కేంద్రాల ద్వారా 13,666 మందికి టీకాలు అందాయి. దీంతో ఇప్పటివరకు టీకాలు తీసుకున్న హెల్త్ కేర్ సిబ్బంది సంఖ్య 69,625కు చేరుకుంది. తొలి రోజున 11 మంది, రెండో రోజున 15 మంది టీకాల కారణంగా స్వల్ప అస్వస్థతకు గురికాగా మంగళవారం మాత్రం 51మందికి రియాక్షన్ వచ్చింది. ఇందులో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలినవారు ఇళ్ళకు చేరుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకోడానికి కొద్దిమంది హెల్త్ కేర్ సిబ్బంది భయపడుతున్నారని, అపోహలే ఇందుకు కారణమని పేర్కొన్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వారికి అవగాహన కలిగించి ఆదివారం ప్రత్యేక సెషన్ ఏర్పాటుచేస్తున్నామని, ఆ రోజు టీకా వేసుకోకపోతే ఇక ఆ తర్వాత మళ్ళీ అవకాశం ఉందని స్పష్టం చేశారు. రియాక్షన్ వచ్చినవారంతా కోలుకున్నారని, ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారని, వారు కూడా ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 22వ తేదీకల్లా ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల 25నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వారి హెల్త్ కేర్ సిబ్బందికి టీకాలను ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరో 3,48,500 వ్యాక్సిన్ (కొవిషీల్డ్) డోసులను పంపగా, భారత్ బయోటెక్ మరో 20వేల కొవాగ్జిన్ డోసులను పంపింది. ఆయా జిల్లాల్లోని హెల్త్ కేర్ సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా జిల్లాలకు రవాణా అవుతున్నాయి. దీంతో రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7,32,500కు చేరుకుంది. ఇందులో నలభై వేలు మాత్రమే కొవాగ్జిన్. మిగిలినవన్నీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులే.

తొలిరోజున 92.2% మేర వ్యాక్సిన్ పంపిణీ నమోదుకాగా రెండో రోజున 84%, మంగళవారం 71% చొప్పున సక్సెస్ అయినట్లు డైరెక్టర్ వెలువరించిన బులెటిన్‌లో పేర్కొన్నారు. బుధవారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం అని, గురువారం, శుక్రవారాల్లో జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొత్తం ప్రభుత్వ వైద్య సిబ్బందికి కవర్ చేస్తామని తెలిపారు. నిజానికి మంగళవారం 1,034 కేంద్రాల్లో సుమారు లక్షల మందికిపైగా ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రజారోగ్య శాఖ దాన్ని 894 కేంద్రాలకు కుదించుకుంది. కనీసం వీటి ద్వారా 73వేల మందికి పైగా టీకాలు ఇవ్వాలనుకుంది. కానీ చివరకు 51,997 మందికి మాత్రమే ఇవ్వగలిగింది. రాష్ట్రం మొత్తం మీద ఆరు వేలకు పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ జరగాల్సి ఉందని ప్రజారోగ్య శాఖ అంచనా వేసింది. ఎంతమంది వేయించుకుంటారో రెండు వారాల తర్వాత స్పష్టత వస్తుంది.

చాలా రాష్ట్రాలకంటే ఉత్తమంగా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టి మూడు రోజుల్లోనే సుమారు 70వేల మందికి టీకాలను పంపిణీ చేయడం పట్ల కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందిలో దాదాపు సగం మందికి టీకాలను ఇచ్చి ఉత్తమ పనితీరు కనబర్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీతో కేంద్ర కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమిష్టి కృషితో సక్సెస్ చేసినందనకు ప్రశంసించారు.

Next Story

Most Viewed