కరోనా అప్‌డేట్.. సెన్సిటివ్ జోన్‌లోకి తెలంగాణ

by  |
కరోనా అప్‌డేట్.. సెన్సిటివ్ జోన్‌లోకి తెలంగాణ
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు మరింత తీవ్రం కానున్నాయి. ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అదనపు సిబ్బందిని సమకూర్చుకుని బుధవారం నుంచే రాష్ట్రంలోని వివిధ ‘హాట్ స్పాట్’లలో దీన్ని ప్రారంభించనుంది. నిర్దిష్ట షెడ్యూలు ప్రకారం ఈ నెల 14వ తేదీకల్లా ముగిసే లాక్‌డౌన్ నాటికి కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల మూడవ వారంకల్లా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చేయాలనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ‘సెన్సిటైజేషన్’ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలనుకుంటోంది. కరోనా లక్షణాలు కనిపించిన వంద కాలనీల్లో పోలీసు సహకారంతో ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించి వైద్యారోగ్య పరీక్షలు చేయాలనుకుంటోంది. అదనపు సిబ్బందిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆ జిల్లాలకు పంపిస్తోంది. జిల్లా వైద్యాధికారుల నేతృత్వంలో ఈ మొత్తం ప్రక్రియ జరగనుంది.

విదేశీ ప్రయాణీకుల ద్వారా వచ్చిన పాజిటివ్ కేసులకంటే మర్కజ్‌ ద్వారా వచ్చినవి ఎక్కువ కావడంతో ప్రభుత్వం మునుపెన్నటికంటే ఎక్కువగా అప్రమత్తమైంది. ఇప్పటిదాకా డైరెక్ట్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారానే పాజిటివ్ కేసులు వచ్చాయని విశ్లేషించిన ప్రభుత్వం ఇకపైన ‘కమ్యూనిటీ స్ప్రెడింగ్’కు అవకాశం ఉండని తీరులో కార్యాచరణను రూపొందించింది. విదేశీ ప్రయాణీకుల ద్వారా వచ్చిన వైరస్ వ్యక్తిగతంగా వారికి, వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే సోకిందని, కానీ మర్కజ్ నుంచి వచ్చినవారి ద్వారా మాత్రం సెకండరీ స్థాయి వరకూ చేరుకుందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెకండరీ స్థాయి తర్వాత ఇంకా ఎవరెవరికి ఈ వైరస్ వ్యాపించిందో ఇప్పుడు ఊహకు కూడా అందడంలేదని, అందువల్ల పాజిటివ్ కేసులు, అనుమానితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రస్తుతానికి ‘హాట్ స్పాట్’లుగా గుర్తించి కార్డన్ సెర్చ్ ద్వారా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఇప్పుడున్న ప్రజారోగ్య (పబ్లిక్ హెల్త్) సిబ్బంది సరిపోకపోవడంతో పలు మార్గాల నుంచి అదనంగా సమకూర్చుకుంటున్నామని, ఎక్కడికక్కడ జిల్లాలకు చేరుకునే వారంతా ఆ జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సులు, ఏఎన్ఎంలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు దాడులు జరగడం, సహకారం ఇవ్వకపోవడం లాంటివాటిని ఆ అధికారి ప్రస్తావిస్తూ, ఇప్పుడు పోలీసులు కూడా ఈ బృందాలతో కలిసే ఉంటున్నారుకాబట్టి పునరావృతమయ్యే అవకాశం లేదన్నారు. ఇప్పటికే జిల్లా వైద్యాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సమాచారం ఇచ్చారని, బుధవారం మొదలు రానున్న వారం రోజుల వరకు వంద చోట్ల ఈ ‘కార్డన్ సెర్చ్’ వైద్య కార్యక్రమం తీవ్ర స్థాయిలో జరుగుతుందన్నారు. ఎలాంటి విదేశీ ప్రయాణం, మర్కజ్ ప్రార్థనలు, వారితో పరిచయమూ లేనివారికి చాలా చోట్ల కరోనా లక్షణాలు రావడంతో ఆ ప్రాంతాల్లో ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఇప్పుడు ఒక్క ఇంటినీ వదలకుండా హెల్త్ సర్వే చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

డైరెక్ట్ పాజిటివ్‌తో పాటు ప్రాథమిక, సెకండరీ కాంటాక్టుల ద్వారా వైరస్ సోకడాన్ని అర్థం చేసుకోవచ్చుగానీ ఎలాంటి సంబంధం లేనివారికి పాజిటివ్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు వైద్యారోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తోందని ఆ అధికారి వివరించారు. ఒక జిల్లాలో మృతి చెందిన మహిళ ఎలాంటి ప్రయాణమూ చేయలేదని, అలాంటివారితో పరిచయం కూడా లేదని, కానీ చివరకు పాజిటివ్ బారిన పడి చనిపోయిందని, ఈ సంఘటనను లోతుగా పరిశీలించిన తర్వాత ఆ ఇంటికి సమీపంలో బీహార్ నుంచి రైల్లో ప్రయాణం చేసి వచ్చిన నలుగురు ఉన్నారన్న విషయం తెలిసిందని, ఈ నలుగురిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షించిన తర్వాత పాజిటివ్ ఉన్నట్లు తేలిందని ఆయన వివరించారు. ఇది ముదిరిపోయి ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’గా మారకుండా ఉండేందుకు ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో ఎక్కడా ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ లేదని, అయితే ఒకటి రెండు కేసుల్లో అనుమానం రావడంతో ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న ‘లాక్‌డౌన్’ను మరి కొంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కొద్దిమందిలో ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలో మాత్రం పాజిటివ్ వస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పద్నాలుగు రోజుల ఇన్‌క్యుబేషన్ ముగిసిపోయిన తర్వాత కూడా కొద్దిమందిలో లక్షణాలు పొడసూపుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం గుమికూడినట్లయితే ఎవరి నుంచి ఎంత మందికి పాకుతుందో స్పష్టంగా చెప్పలేమని, కనీసం అంచనా కూడా వేయలేమని, ‘క్యమూనిటీ ట్రాన్స్‌మిషన్’ తీవ్రతకు కొలమానం లేకుండా పోతుందని, అందుకే ఇప్పుడు ‘కార్డన్ సెర్చ్ హెల్త్ సర్వే’ క్యాంపెయిన్‌ను వేగవంతం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ఈ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదాన్ని నివారించడానికే లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాల పాటు కొనసాగించడం అవసరమని అంటువ్యాధుల నిపుణులు చేసిన సూచనలను ఆ అధికారి గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేస్తే అది ఎలాంటి విపరీతానికి దారితీస్తుందో తెలియదు కాబట్టి మన ప్రయత్నాలన్నీ ముగిసేంత వరకు యధాతథంగా కొనసాగించడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసమే వచ్చే వారమంతా ఈ క్యాంపెయిన్ నిర్వహించిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని, పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతాయని, ఆ తర్వాత వారం రోజులకు ఒక్క పాజిటివ్ కేసుకూ ఆస్కారం ఉండదన్నారు. ఆ తర్వాత వారం రోజుల పాటు మొత్తం పరిస్థితిని సమీక్షించుకోవచ్చునని, ఆ ప్రకారం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగడం మంచిదన్నారు. తెలంగాణకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సెకండరీ స్థాయి తర్వాత కూడా వైరస్ సోకుతున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయన్నారు.

Tags: Telangana, LockDown, Corona, Cardon Search, Health Survey, Sensitive Zone


Next Story

Most Viewed