మృతదేహాలకు కరోనా టెస్ట్ చేయాలి

by  |
మృతదేహాలకు కరోనా టెస్ట్ చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోడానికి మృతదేహానికి నిర్ధారణ పరీక్షలు జరపాల్సిందేనని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మృతికి వైరస్ కారణమో లేదో తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 26వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు అప్పటికి రాష్ట్రం సమగ్రమైన స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సూచించింది. మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్ష ప్రయోజనం, వ్యూహం తదితరాలను అందులో పేర్కొనాలని చెప్పింది. వైరస్‌ను నివారించడానికి ఇప్పుడు తీసుకుంటున్న చర్యలపై కూడా అందులో వివరణ పొందుపర్చాలని సూచించింది. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె లక్ష్మణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించి పై విధంగా వ్యాఖ్యానించింది.

పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ, మృతదేహాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంపై ఐసీఎంఆర్ గత నెల 13 అంతకు ముందు మార్చి 24 తేదీల్లో జారీ చేసిన మార్గదర్శకా (నోటిఫికేషన్)లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తికి కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడం, ట్రేస్ చేయడం, ఐసొలేట్ చేయడం ఆ తర్వాత చికిత్స అందించడం అవసరమని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటించాల్సి ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన డాక్టర్లకు చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా మృతదేహానికి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వాదించారు. ఇటలీ, అమెరికా దేశాల్లో ఇలాంటి పరీక్షలు చేయని కారణంగానే వైరస్ విస్తృతంగా వ్యాపించిందని గుర్తుచేశారు.

ఈ వాదనలను విన్న డివిజన్ బెంచ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మృతదేహాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించింది. ఈ నెల 12వ తేదీన జరిగిన విచారణ అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సమర్పించిన అఫిడవిట్‌పై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన బెంచ్ అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తాజా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవద్దంటూ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ ఏప్రిల్ 20వ తేదీన దాని పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. మృతదేహం నుంచి ఎలాంటి శాంపిళ్ళను తీసుకోవద్దని, ఇప్పటికే అలాంటి ఆదేశాలు ఇచ్చినా ఇంకా దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. మరోవైపు వైద్య మంత్రి సైతం మృతదేహాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవద్దని, ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నట్లయితే నిర్ధారణ పరీక్షలు చేయకుండానే కరోనా పేషెంట్ అనే తరహాలోనే మృతదేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు సూచించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed