ప్రభుత్వాఫీసులో 19 మందికి కరోనా

by  |
ప్రభుత్వాఫీసులో 19 మందికి కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రజలను వివిధ రోగాల నుంచి కాపాడాల్సిన రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయానికే కొవిడ్19 బెడద పట్టుకుంది. వారం రోజుల క్రితం ఈ భవనంలోని ఎంటమాలజీ విభాగంలో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. గురువారంనాటికి మరో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తాత్కాలికంగా ఆ కార్యాలయానికి తాళం పడింది. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిచిపోయాయి. సిబ్బంది సోమవారం వరకు విధుల్లోకి రావద్దంటూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర విభాగాల ఉద్యోగులతోపాటుగా, సందర్శకులెవ్వరూ కార్యాలయంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఈ భవనంలో డైరెక్టర్ ఛాంబర్‌కు ఆనుకుని ఉన్న సమావేశ మందిరానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని, అందుకే ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్ విధులను పర్యవేక్షిస్తున్న నలుగురైదుగురు ఉన్నతాధికారులు మాత్రం కార్యాలయానికి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులతో సమన్వయం చేసుకునే పనులను మాత్రమే వీరు పర్యవేక్షించనున్నారు.

సారీ! రెండు రోజులు శాంపిల్స్ ఆపేస్తున్నాం

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి శాంపిల్స్ తీసుకునే ప్రక్రియకు ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ రెండు రోజుల విరామం ఇచ్చింది. ఇప్పటికే తీసుకున్న శాంపిల్స్‌ను పరీక్షించి రిపోర్టులు వెల్లడించడానికి సామర్థ్యం సరిపోవడంలేదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా శాంపిల్స్ తీసుకుంటే ల్యాబ్‌లపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. పది రోజల వ్యవధిలో సుమారు 50 వేల టెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 16 నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామని, ఇప్పటివరకు సుమారు 36 వేల వరకు తీసుకున్నామని వివరించింది. ఇందులో 8,253 శాంపిళ్లను ఇంకా పరీక్షించాల్సి ఉన్నదని, ఇది పూర్తయిన తర్వాత కొత్తవి తీసుకుంటామని తెలిపింది.

సీఎం ఆదేశించినా.. మంత్రి ప్రకటించినా

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పది ల్యాబ్‌లు రోజుకు సగటున నాలుగున్నర వేల కరోనా పరీక్షలు చేయగలుగతాయని మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించారు. కొత్తగా సమకూర్చుకోవాలనుకున్న కోబాస్ 8800 మిషన్ కూడా వచ్చినట్లయితే అదనంగా మరో మూడు వేలకు పైగా టెస్టులు చేసే వెసులుబాటు కలిగేదని అన్నారు. కానీ, కేంద్రం దాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తరలించిందని పేర్కొన్నారు. రోజుకు సగటున మూడున్నర వేల టెస్టులు కూడా ప్రభుత్వ ల్యాబ్‌లకు భారంగా మారింది. సీఎం కేసీఆర్ లెక్క ప్రకారమే చూస్తే పది రోజుల్లో 50 వేల టెస్టులు జరగాలి. కానీ ఈ నెల 16 నుంచి జూన్ 24 వరకు సేకరించిన శాంపిళ్ళు 22,887 మాత్రమే. ప్రజారోగ్య డైరెక్టర్ మాత్రం 36 వేలు అని చెబుతున్నారు. తీసుకున్న శాంపిళ్ళలో దాదాపు మూడవ వంతు ఇంకా పరీక్షలు చేసే దశలోనే ఉన్నాయి. త్వరలో రోజుకు పదివేల టెస్టులు చేస్తామని మంత్రి టిమ్స్ సందర్శన సందర్భంగా బుధవారం ప్రకటించారు. మూడున్నర వేల టెస్టులకే ఒత్తిడి పెరుగుతూ ఉంటే ఇక పదివేల టెస్టులు చేయగలుగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.



Next Story

Most Viewed