ప్రైవేటు టీచర్ల జీవితాలపై కరోనా కాటు..

by  |

దిశ, న్యూస్ బ్యూరో: బ్లాక్‌బోర్డు తెల్లబోయింది. తరగతి గది బోసిపోయింది. బడి మూతబడింది. కరోనా మాటు వేసింది. నిశ్శబ్దం కాపలా కాస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా అదే చిత్రం. అన్నింటిదీ అదే తీరు. కాకపోతే, టీచర్ల వెతలు వేర్వేరు. ప్రభుత్వపంతుళ్ల పరిస్థితి కొంచెం బెటర్. ప్రైవేట్ టీచర్ల వేతనాల వెతలు అన్నీఇన్నీకావు. జీతాల్లేవు. జీవితాలేం బాగోలేవు. లాక్‌డౌన్ వారి బతుకులను చక్రబంధం చేసింది. చేయూత కరువైంది. యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లల్లో నాలుగు నెలల వేతనాలివ్వలేదు. వీరి ఉద్యోగాలకు అభద్రత పహరా కాస్తోంది. ఇల్లు గడవడం లేదు. రోజులు నెట్టుకురావడం వారి వల్ల కావడంలేదు.

రాష్ట్రంలో మొత్తం 10 వేల 549 ప్రైవేటు పాఠశాలలుండగా వాటిలో లక్షా ఒక వేయి తొమ్మిది వందల మంది టీచర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జనతా కర్ఫ్యూ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మార్చి 31 దాకా లాక్‌డౌన్ ప్రకటిస్తే ప్రధాని నరేంద్ర మోడీ దానిని ఏప్రిల్ 14 దాకా
పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో గత 15 రోజులుగా రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు తాళాలు వేశారు. ప్రభుత్వం పరీక్షలన్నీ వాయిదా వేసింది. పిల్లలంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, స్కూళ్లు మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో జవాబు లేని ప్రశ్నగా మారింది. స్కూళ్లు సరిగా నడిచినపుడే టీచర్లకు టైముకు జీతాలివ్వడానికి ముందుకురాని యాజమాన్యాలు ప్రస్తుతం లాక్‌డౌన్ దెబ్బకు స్కూళ్లన్నీ మూతపడడంతో టీచర్లకు జీతాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గి స్కూళ్లు మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో ఎంత మంది పిల్లలు వస్తారో తెలియకనే యాజమాన్యాలు టీచర్ల జీతాలపై నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నాయని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ టీచర్లతో పోలిస్తే వీరి ఉద్యోగ భద్రత శూన్యం. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఈ లాక్‌డౌన్ వల్ల జీతంలో కోత విధించినప్పటికీ మళ్లీ తర్వాత ఎలాగైనా ఆ మిగిలిన జీతం ఇస్తుందన్న ధీమా వారికి ఉంది. అయితే చాలా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫుల్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ టీచర్లకు మాత్రం టైముకు జీతాలివ్వట్లేదని వారు వాపోతున్నారు. మార్చి నెల జీతం సంగతి దేవుడెరుగు కానీ ఇప్పటికీ కొన్ని స్కూళ్లలో ఫిబ్రవరి జీతమే ఇవ్వలేదని వారంటున్నారు. ఈ విషయమై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, టీచర్లకు జీతాలివ్వాల్సిందిగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించాలని వారు కోరుతున్నారు.

కార్పొరేట్ స్కూళ్లలో కొనసాగుతున్న డిజిటల్ పాఠాలు

ఎప్పటిలాగే కార్పొరేట్ స్కూళ్లు ఈ సోషల్ డిస్టెన్సింగ్ సమయంలోనూ తమ పని తాము చేసుకుంటున్నాయి. వాట్సాప్‌లో పిల్లల పేరెంట్స్‌తో టచ్‌లో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాయి. పిల్లలకు వాట్సాప్, వీడియో కాల్‌లు చేస్తూ హోం వర్క్‌లు ఇస్తూ బోధన కానిచ్చేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ కాకుండా మిగతా పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు పెట్టినా పెట్టకపోయినా పై తరగతికి ప్రమోట్ చేసేందుకు వీలుగా వారిని సిద్ధం చేస్తున్నారు. ఈ స్కూళ్లలో టీచర్లు సాధారణ రోజుల్లా కాకుండా రోజూ స్కూలుకు రాకుండానే ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నారు. ఇలాంటి స్కూళ్లలో యాజమాన్యాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫుల్‌గా ఫీజులు వసూలు చేస్తున్నందున టీచర్లకు సైతం వారు కరెక్టుగా జీతాలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, చిన్న, మధ్య తరహా స్కూళ్లలో టీచర్లకే ఇప్పుడు జీతాల సమస్య వచ్చిపడిందంటూ ఆయా స్కూళ్లలో పనిచేసే పలువురు టీచర్లు వాపోతున్నారు.

మార్చి, ఏప్రిల్ నెల జీతాలు లేనట్లే : యాసాని యాకన్న, కోణార్క్ స్కూల్, ఉప్పల్

‘జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వల్ల స్కూళ్లు మూసే మందు వరుస సెలవులు రావడంతో ఊళ్లకు వెళ్లాం. ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించగానే మళ్లీ తిరిగి హైదరాబాద్ రాలేకపోయాం. మార్చి నెల జీతం ఇప్పటికీ రాలేదు. ఇక ఏప్రిల్ నెల జీతమైతే మొత్తానికే వచ్చే పరిస్థితి లేదు. మార్చి నెలలో జీతమిచ్చినా 19వ తేదీ వరకే ఇస్తారేమో అని అంటున్నారు. మళ్లీ చెప్పే దాకా స్కూలుకు రావాల్సిన అవసరం లేదని యాజమాన్యం ఫోన్ లో సమాచారమిచ్చింది. హైదరాబాద్ లో ఉండే రూముకు ఇప్పటికీ రెంటు కట్టలేదు. ఓనర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు’

మార్చి నెల జీతం రాలేదు : చిరంజీవి, నోబుల్ పబ్లిక్ స్కూల్, నాచారం

‘మార్చి నెల జీతం ఇప్పటికీ రాలేదు. మూతపడ్డు స్కూళ్లు ఎప్పటికి తెరుస్తారో తెలియదు. ఏప్రిల్ నెల జీతంపై ఆశ లేదు. లాక్ డౌన్ ముగిసి స్కూళ్లు మళ్లీ తెరచుకున్న తర్వాతే జీతాల విషయం తెలిసే అవకాశముంటుంది. ప్రస్తుతానికైతే మార్చి నెల జీతం రాకపోవడంతో నెల ఖర్చులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వమే టీచర్లకు జీతాల్లో కోత విధించడంతో మాకు ఈ పరిస్థితి వచ్చందనుకుంటున్నాం. ప్రభుత్వాలు ఈ విషయంలో యాజమాన్యానికి ఆదేశాలిచ్చి మాకేదైనా ఆర్థిక సహాయం చేపిస్తే బాగుంటుంది’

మాకైతే జీతాలిచ్చారు: రంజిత్, కార్పొరేట్ స్కూల్ టీచర్

‘మా స్కూల్ జనతా కర్ఫ్యూ రోజు నుంచే మూతపడింది. మేమంతా ఇళ్లలోనే ఉండి విద్యార్థుల పేరెంట్స్‌కు, మరోపక్క యాజమాన్యానికి ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటున్నాం. ఇన్ని రోజులు చెప్పిన సిలబస్ విద్యార్థులు మర్చిపోకుండా ఉండేందుకు పిల్లలకు వాట్సాపుల్లో హోం వర్క్ ఇస్తూ ప్రాక్టీస్ చేయిస్తున్నాం. పేరెంట్స్ ఇళ్లలోనే ఉండడంతో వారు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సహకరిస్తున్నారు. ఇక లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. యాజమాన్యం ఎలా చెబితే మేం అలా నడుచుకుంటాం. మార్చి నెలలో మాకు రావాల్సిన జీతాలు యాజమాన్యం ఎప్పటిలాగే చెల్లించింది’

జీతాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించాలి: బీఎస్ఎఫ్

‘రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు రెట్టింపయ్యాయి. కొన్ని స్కూళ్లు జనవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోగా మరికొన్ని కరోనా సాకుతో ఈ నెల వేతనాలు ఇచ్చేలా లేవు. వాస్తవంగా కరోనా ఎఫెక్ట్‌ మార్చి నెలలో ప్రారంభమైంది. కానీ, స్కూళ్లు మాత్రం అంతకు ముందు నుంచే వేతనాలు చెల్లించడం లేదు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు మాత్రం 10 నెలల వేతనాలు మాత్రమే ఇస్తుండడం శోచనీయం. కొందరు టీచర్లకు నాలుగైదు నెలలుగా జీతాలు లేకపోవడంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వారికి వేతనాలిచ్చేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలి’ అని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బీఎస్ఎఫ్) ప్రెసిడెంట్ జక్కనపల్లి గణేష్ డిమాండ్ చేసారు.

Tags: corona, lock down, telangana, private schools, teachers, salaries, unions



Next Story

Most Viewed