రేవంత్‌ పీసీసీ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మంతనాలు

by  |
రేవంత్‌ పీసీసీ ఎఫెక్ట్..  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మంతనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కీలక సమయంలో కాంగ్రెస్​ పార్టీ మరో చారిత్రాత్మక తప్పు చేసినట్లుగా మారింది. కాంగ్రెస్​ను భూస్థాపితం చేయడంలో కేసీఆర్​ సక్సెస్ అయినట్లు ఇప్పటికే ప్రచారం ఉండగా… మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అంశం, హుజురాబాద్​ ఉప ఎన్నిక హాట్​ టాపిక్​గా మారిన ఈ సమయంలో ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంను కలువడం కాంగ్రెస్​ నేతలపై మరింత అనుమానం పెంచింది. రాజకీయ చదరంగంలో భాగంగా కాంగ్రెస్​ నేతలకు సీఎం అపాయింట్​మెంట్​ ఇచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే కారణాలు ఏమైనా.. ఈ సమయంలో కాంగ్రెస్​ నేతలు ప్రగతిభవన్​ మెట్లు ఎక్కడం అపవాదును తెచ్చి పెడుతోంది. మరోవైపు దీనిపై హస్తం నేతలు హస్తినకు లేఖలు పంపుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సీఎంను కలువడంపై సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

ఏడేండ్ల తర్వాత తొలిసారి

తెలంగాణ స్వరాష్ట్రం తర్వాత కాంగ్రెస్​ నేతలకు శుక్రవారం సీఎం అపాయింట్​మెంట్​ దొరికింది. ఏండ్ల నుంచి సీఎంను కలిసేందుకు అర్జీలు పెట్టుకున్నా.. ఒక్కసారి కూడా రిప్లై రాలేదు. ఇటీవల కరోనా కష్టకాలంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇలా చాలా అంశాల్లో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. మాజీ ఎంపీ వీహెచ్​ ఏకంగా ప్రగతిభవన్​ దగ్గరకు వెళ్లారు. రోడ్డు మీద నుంచే వెనక్కి పంపించారు. కానీ శుక్రవారం ఏం జరిగిందో తెలియదు కానీ… కేవలం 10 నిమిషాల్లో డేట్​ ఫిక్స్​ అయింది. ప్రగతిభవన్​లో ఉంటే.. సమావేశాల్లో బిజీగా ఉండే సీఎం కేసీఆర్​… ప్రతిపక్ష నేతలను పిలిపించుకున్నారు. దీనికి లాకప్​డెత్​ కేసు వేదికగా మారింది. కాంగ్రెస్​ నేతలు సీఎంను కలిసేందుకు మరియమ్మ మరణం కలిసి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్​ స్టేషన్​లో మరియమ్మ అనే మహిళలను పోలీసులు చంపారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రెండు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న భట్టి… ఇప్పటి వరకు దీనిపై సీఎంను కలుస్తామని, కలిసేందుకు సమయం ఇవ్వాలనే డిమాండ్​ చేయలేదు. కానీ అనూహ్యంగా మరియమ్మ లాకప్​డెత్​ ఆరోపణలపై సీఎం కేసీఆర్​… కాంగ్రెస్​ నేతలను ప్రగతిభవన్​కు పిలిపించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు జరిగినా స్పందించని సీఎం… మరియమ్మ అంశంపై మాత్రం విపక్ష నేతలను ఆహ్వానించారు. మంథనికి చెందిన న్యాయవాదుల హత్య అంశం రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీనిపై కూడా ఊసెత్తని పరిణామాల్లో సీఎల్పీ నేత భట్టితో కలిసి మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, కొంతకాలంగా స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, గతంలో కేసీఆర్​తో కలిసి ఉండి, తెగతెంపులు చేసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎంను కలిసి ఓ మెమోరాండం సమర్పించారు. మొత్తానికి సీఎంను కలిసేందుకు కాంగ్రెస్​ నేతలకు మరియమ్మ మరణం అవకాశం కల్పించినట్లైంది.

అటు హుజురాబాద్​… ఇటు రేవంత్​ అంశమేనా..?

కాంగ్రెస్​ నేతలకు రాచకోట గేట్లు తెరుచుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పలు రకాల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హుజురాబాద్​లో ఉప ఎన్నిక టీఆర్​ఎస్​కు ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. అక్కడ ఈటల రాజేందర్​ను ఓడించేందుకు టీఆర్​ఎస్​ పార్టీ సకల ప్రయత్నాలూ చేస్తోంది. వందల కోట్లను వెదజల్లుతోంది. పార్టీ మొత్తం అక్కడే మకాం వేస్తోంది. మరోవైపు అక్కడి కాంగ్రెస్​ నేత కౌశిక్​రెడ్డి వ్యవహారం కూడా పార్టీలో చర్చగా మారింది. కాంగ్రెస్​ పార్టీ మొత్తం ఈటల రాజేందర్​ను వెనకేసుకొచ్చినా.. కౌశిక్​రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన్ను వెనక నుంచి టీఆర్​ఎస్​ నడిపిస్తోందనే టాక్​ కూడా ఉంది. ఇలాంటి సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కలిసి సీఎంను కలవడం హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో భాగమేననే చర్చ సాగుతోంది. కాంగ్రెస్​లో కేసీఆర్​ కోవర్టులు ఉన్నారనేది రాష్ట్రంలో ముందు నుంచీ ఉన్న ప్రచారమే. దీనికి ఆజ్యం పోస్తూ ఇప్పుడు కాంగ్రెస్​ నేతలు సీఎంను కలువడం, ఏడేండ్లలో ఎన్నడూ లేని విధంగా వారికి అపాయింట్​మెంట్​ ఇవ్వడం ప్రాధాన్యతగా మారింది. హుజురాబాద్​లో టీఆర్​ఎస్​ గెలుపు కోసం కాంగ్రెస్​కు ప్యాకేజీ ఇచ్చినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

Read More: హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే.. ప్రజలు ఎటువైపు?

దీనికి తోడుగా టీపీసీసీ చీఫ్​ అంశం ఇటీవల హీటెక్కిస్తోంది. ఎంపీ రేవంత్​రెడ్డి పేరు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడో, అప్పుడో ప్రకటిస్తారని కూడా అంటున్నారు. అయితే టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి రాకను టీఆర్​ఎస్​ అడ్డుకుంటోందనేది ఇది వరకు ఉన్న ప్రచారమే. కేవలం కేసీఆర్​ కుటుంబాన్ని టార్గెట్​గా చేసుకున్న రేవంత్​… ఏ చిన్న అంశమైనా కేసీఆర్​పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిణామాల్లో రేవంత్​రెడ్డికి టీపీసీసీ చీఫ్​ ఇస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని టీఆర్​ఎస్​ బాస్​ అంచనా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్​లోని మిగిలిన వర్గాలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్​ ఈ ప్లాన్​ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండే కాంగ్రెస్​లో ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారుతోంది.

సీఎం దగ్గరకు వెళ్లేందుకు ఇదేనా సమయం..?

ప్రగతిభవన్​కు వెళ్లేందుకు ఇది సమయం కాదని కాంగ్రెస్​ పార్టీలోనే మరో వర్గం వాదిస్తోంది. ఎందుకంటే మరియమ్మ మరణం విషయంలో ఇప్పటి వరకూ సీఎంను కలువాలనే డిమాండ్​ కూడా లేదు. కానీ దీన్ని సాకుగా చూపించుకుంటూ సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పెద్దలకు ఇప్పటికే సమాచారం అందించారు. కొంతమంది నేతలు లేఖలు కూడా పంపుతున్నారు. హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​తో చేతులు కలుపడం, టీపీసీసీ చీఫ్​ అంశంలో రేవంత్​ను అడ్డుకోవడం, గ్రూపు రాజకీయాలు మరింత రెచ్చగొట్టడంలో భాగంగానే ఈ కలయిక అంటూ లేఖలో వివరిస్తామంటూ పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఏది ఏమైనా… కారణాలు ఏవైనా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు… తొలిసారిగా ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంను కలవడం వివాదంగానూ మారింది.

Read More: ‘సిగ్గులేదా’.. తీహార్ జైలుకెళ్తూ నవ్వుతున్న స్టార్ రెజ్లర్



Next Story

Most Viewed