సింగరేణి సమ్మెపై కుట్రలు.. అక్కడ ఏం జరుగుతోంది ?

by  |
సింగరేణి సమ్మెపై కుట్రలు.. అక్కడ ఏం జరుగుతోంది ?
X

దిశ, గోదావరిఖని : తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికుల సమ్మెపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగు బొగ్గు గనుల ప్రైవేటీకరణపై జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసుతో 72 గంటల సమ్మెకు కార్మికులు సిద్ధమై గత రెండు రోజులుగా స్వచ్చందంగా కార్మికులు ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు ఉన్నతాధికారుల మన్ననలు పొందడానికో లేక అత్యుత్సాహమో తెలియదు కానీ కిందిస్థాయి సెక్యూరిటీ సిబ్బంది తో ఇతర ఉద్యోగులతో బొగ్గు ఉత్పత్తికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారుతోంది. దీంతో అధికారుల తీరుపై ఇటు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జీ-2 ఓసీపీ-3 సీ హెచ్ పీ లో మల్లికార్జున ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన వాగేన్స్ లో బొగ్గు లోడింగ్ చేసి కోల్ యార్డుకు తీసుకవెళ్లే క్రమంలో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కన్వేయర్ ఆపరేటర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే సీహెచ్‌‌పీ‌లో బొగ్గు లోడింగ్ చేసే సమయంలో ఆపరేటర్‌తో పాటు పర్యవేక్షణ అధికారి తప్పనిసరిగాఉండాలి. ఎవరు లేకుండానే ఉన్నతాధికారుల మన్ననలు పొందడానికి కొంత మంది అధికారులు ప్రయత్నించిన అత్యుత్సాహం వివాదాస్పదంగా అవుతుంది. ఆ సమయంలో ఇంకా ఏదయినా ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశాలు ఉండేవని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని కార్మిక సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఓసీపీ-4, సీఎస్ పీ-1 నుంచి సెక్యురిటీ సిబ్బందితో కలసి అధికారులు బొగ్గు తరలిస్తుండగా జేఎస్‌సీ కార్మిక సంఘాల నాయకులు, లారీలను అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులతో సైతం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. అధికారుల వ్యవహరిస్తున్న విధానంపై మండిపడుతున్నారు. మరో సారి కార్యాచరణ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ఢిల్లీ‌లో కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో కార్మిక సంఘాల నాయకులు పెట్టిన డిమాండ్లను యాజమాన్యం అంగీకరించకపోతే కార్మికులతో కలిసి నిరవధిక సమ్మెను సైతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కార్మిక సంఘాల నాయకులు ఏ మేరకు ప్రణాళికలు చేపడతారో వేచి చూడాల్సిందే.

అధికారుల తీరు సరైంది కాదు..

ఓ వైపు కార్మికులు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే అధికారులు బొగ్గు ఉత్పత్తి మీద దృష్టి పెట్టడం సరైనది కాదని జేఏసీ నాయకులు చెల్పూరి సతీష్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొంత మంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రవర్తన మార్చుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యాజమాన్యం కార్మికులకు సహకరించాలని అన్నారు. బొగ్గు గనుల వేలం పాటను ఆపకపోతే కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు మరోసారి నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

జేఏసీ నాయకులు చెల్పూరి సతీష్



Next Story

Most Viewed