తగ్గేది లేదంటున్న కాంగ్రెస్.. పోలీసుల కళ్లుగప్పి..

by  |
తగ్గేది లేదంటున్న కాంగ్రెస్.. పోలీసుల కళ్లుగప్పి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినా… కాంగ్రెస్ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్ద హల్ చల్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి రాజ్ భవన్‎కు చేరుకుని రాజ్‎భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంతేకాకుండా జూబ్లీహిల్స్​లోని తన నివాసం నుంచి రేవంత్​రెడ్డి ర్యాలీగా బయలు దేరారు. అయితే దీన్ని ఆపేందుకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయన్నారు. ఇంట్లో తినటానికి గ్యాస్ వెలిగించాలి అంటే అక్క చెల్లెల్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెరుగుతున్న ధరల మీద నిరసన తెలపడానికి వస్తున్న తమను అడ్డుకుంటున్నారని, పోలీసులను నెట్టుకొని అయినా రాజ్‌భవన్ వెళ్లి తీరుతామని, గవర్నర్‌కి వినతి పత్రం సమర్పిస్తామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.



Next Story

Most Viewed