బండి సంజయ్ వ్యాఖ్యలపై డీజీపీకి కాంగ్రెస్ లేఖ

by  |
Niranjan
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్మాదిలా మారి రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయమై మంగళవారం ఆయన డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఈనెల 27న పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను కట్టడి చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖపై ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఇలా రెచ్చగొట్టే మాటలను అనుమతించాలా లేదా అనే విషయాన్నని డీజీపీ ఆలోచించాలని కోరారు.

నిజాం మనవడు ప్రిన్ష్ ముఫ్ఫక్కమ్ జా 1999లో ఒక పత్రికలో వచ్చిన వార్తను చదివి నిజాం ట్రస్ట్ ఏనుగు హష్మీని అక్కన్న మాదన్న మహంకాళి మందిర బోనాల ఊరేగింపునకు అనుమతించిన తీరు ఆ కుటుంబ పరమత సహనానికి నిదర్శనమని కొనియాడారు. చైనాతో యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు నిజాం 5000 కేజీల బంగారం ఇచ్చిన విషయం బండి సంజయ్‌కు తెలియకపోవచ్చని విమర్శించారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లర్లు చెలరేగితే చార్మినార్ వద్దే బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మజ్లిస్ నాయకులను గట్టిగా హెచ్చరించడమే కాకుండా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ సలాహుద్దీన్‌తో సహా మజ్లిస్ శాసన సభ్యులను నగర బహిష్కరణ చేశారని గుర్తుచేశారు. 2012లో కూడా భాగ్యలక్ష్మి ఆలయ విషయంలో గొడవ చేస్తున్న మజ్లిస్ శాసనసభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన ధోరణి మార్చుకుని పార్టీ ప్రచారం చేసుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదని డీజీపీకి రాసిన లేఖలో నిరంజన్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed