కెఎల్ఐ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకుల జలదీక్ష

by  |
కెఎల్ఐ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకుల జలదీక్ష
X

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జలదీక్షను పోలీసులు అడుగడుగునా అడ్డుకోగా, వనపర్తి జిల్లా నాయకులు మాత్రం ఎట్టకేలకు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం నుంచి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కొల్లాపూర్ మండలంలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆంధ్ర పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను..రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నకాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంత రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసన తెలపాలనుకున్నతమను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు వివరించారు.ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తూ, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. దీనిపై స్పందించని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పై విడుదల చేసిన జీఓ నెంబర్ 203ను వెంటనే ఉపసంహరించుకునేలా, దక్షిణ తెలంగాణా ప్రాంత టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీం కేసీఆర్ పై ఒత్తిడి తేవాలని కోరారు.కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి.క్.విశ్వనాథ్ , ఇంద్రసేనారెడ్డి, చిన్నంబావి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed