తీవ్ర ఉద్రిక్తత.. TRS ఎమ్మెల్యే కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి

by  |
తీవ్ర ఉద్రిక్తత.. TRS ఎమ్మెల్యే కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి
X

దిశ, అశ్వారావుపేట టౌన్ : అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటూ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో రింగ్ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్‌కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కార్యాలయం ముట్టడిలో భాగంగా గేటు ముందు బైఠాయించి ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా దళిత బంధు పథకం వర్తింపు చేస్తారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరుతారంటూ, ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు.

క్యాంపు కార్యాలయం గేట్లకు తాళాలు వేసి ఉండటంతో గోడ దూకి వెళ్లి కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. రాళ్లు రువ్వి కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సీఐ బంధం ఉపేందర్ రావు, ఎస్సై చల్లా అరుణ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో పీసీసీ కోర్డినేటర్ దళిత దండోరా అశ్వారావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ మసానపల్లి లింగోజీ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ రామిశెట్టి మనోహర్ నాయుడు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గురిజాల, నియోజకవర్గం అధ్యక్షులు కొరంపల్లి చెన్నారావు, జడ్పీటీసీ సున్నం నాగమణి ఉన్నారు.

అయితే తన క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే మెచ్చా.. ములకలపల్లి మండల పర్యటనలో ఉన్నారు. ఈ దాడి ఘటనపై ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఈ ఘటనపై విచారణ అనంతరం 22 మందిపై 452, 427, 371, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చల్లా అరుణ తెలిపారు.

ఎమ్మెల్యే మెచ్చా జోలికి వస్తే సహించం..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి చాంబర్లో మండల టీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలు కారణాలతో పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎందరో ఉండగా, కేవలం గిరిజన ఎమ్మెల్యే అనే చిన్న చూపుతోనే మెచ్చా క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని అన్నారు.

ఎమ్మెల్యే మెచ్చాపై అవాక్కులు, చవాక్కులు పేల్చాలని చూస్తే సహించేది లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, కార్యదర్శి బండారు. శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సంపూర్ణ, ప్రధాన కార్యదర్శి పసుపులేటి ఫణీంద్రతోపాటు నాయకులు మోహన్ రెడ్డి, నాని పాల్గొన్నారు.


Next Story

Most Viewed