రంగంలోకి కాంగ్రెస్, బీజేపీ.. టీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్!

by  |
TRS
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలపై విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకత తమకు కొంతైనా అనుకూలంగా మారుతుందని భావిస్తున్నాయి. గెలిచే బలం లేకున్నా.. సర్కారుపై ఉన్న వ్యతిరేకతను చేజిక్కించుకుంటే గెలుపు సాధ్యమనే తీరుతో మండలి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్​పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కీలకమైన మెదక్​స్థానం నుంచి టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలను పోటీకి దింపేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. దీనిపై సోమవారం రాత్రి వరకు కూడా జగ్గారెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​దామోదర రాజనర్సింహా, వర్కింగ్​ప్రెసిడెంట్​మహేశ్​ కుమార్​గౌడ్‌తో భేటీ అయ్యారు.

మనకూ కలిసి వస్తుంది

స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో మొత్తం 9917 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఓటర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది పరిషత్​సభ్యులే. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, సర్పంచ్‌లతో సమానంగా ఎంపీటీసీలు ఉంటారనే కోణంలో ప్రచారం చేసింది. ప్రతి అభివృద్ధి పనిలో ఎంపీటీసీ సభ్యులను భాగస్వాముల్ని చేస్తున్నట్లు చెప్పింది. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే 10 శాతం నిధులు తప్ప.. ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఎంపీటీసీలకు పని లేకుండా పోయింది.

అటు జెడ్పీటీసీ సభ్యుల పరిస్థితి కూడా అంతే. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికల జరిగిన నాటి పరిస్థితికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. చాలా మంది పార్టీలు మార్చారు. కొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్లారు. వారిలో ఎక్కువగా కాంగ్రెస్​తరుపున గెలిచిన వారే ఉన్నారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీకే 70 శాతానికిపైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఇక్కడే అసలు చిక్కులు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అటు విపక్షాలు భావిస్తున్నాయి. దీనికి తోడుగా ఎంపీటీసీల సంఘం కూడా ఎవరికి వారే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీటీసీ సంఘంతో పాటుగా పంచాయతీ రాజ్​చాంబర్స్​అసోసియేషన్ కూడా నామినేషన్లు దాఖలు చేసింది. దీంతో అధికార పార్టీకి కొంత తలనొప్పిగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకుంటే కలిసి వస్తుందని కాంగ్రెస్​భావిస్తోంది. అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్‌కు, కొన్నిచోట్ల బీజేపీకి సహకరిస్తామంటూ హామీ కూడా ఇస్తున్నారు. దీంతో ప్రధానంగా కాంగ్రెస్​ఆశలు పెట్టుకుంది.

పోటీ చేద్దాం

స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్న వ్యతిరేకతను ‘క్యాష్​’ చేసుకుంటే కొంత ఒక్కటీ, రెండు స్థానాల్లోనైనా కలిసి వస్తుందని అంచనా వేసున్న పార్టీలు పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్​నుంచి మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్​స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. దీనిపై టీపీసీసీ నిర్ణయం తీసుకుని ప్రకటించనుంది. మెదక్​నుంచి జగ్గారెడ్డి సతీమణి నిర్మల పోటీకి సుముఖంగా ఉండగా.. అటు నిజామాబాద్​నుంచి ఓ ఎన్నారై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు, నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్‌గౌడ్, వరంగల్ నుంచి వేం వాసుదేవరెడ్డిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. మంగళవారంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన నిర్ణయాన్ని.. ఆయా జిల్లాల డీసీసీలకే అప్పగించిన కాంగ్రెస్​.. అక్కడి నుంచి వచ్చిన అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.


Next Story