కమీషన్ల కోసమే కల్వకుర్తి డిజైన్​ మార్చారా?

by  |
కమీషన్ల కోసమే కల్వకుర్తి డిజైన్​ మార్చారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో:

‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. అండర్ గ్రౌండ్‌లో పేలుళ్లు చేయాల్సి వస్తే పక్కనే ఉన్న కల్వకుర్తి పంప్ హౌస్ దెబ్బతిని, మోటార్లకు ప్రమాదం ఉంటుంది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణంలో వెంకటాపురం దగ్గర రామప్ప దేవాలయానికి ఏ విధంగా బీటలు వారుతుందో అదే విధంగా కల్వకుర్తి పంప్ హౌస్‌ దెబ్బతింటుంది..’’
-2016లో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలో సారాంశం ఇది.

కానీ, ప్రభుత్వం ఇంజినీర్ల నివేదికలను పక్కన పెట్టింది. కారణాలేమైనా అప్పటి కాంట్రాక్టర్ల వైపు మొగ్గు చూపింది. ఫలితంగా కల్వకుర్తి పంప్ హౌస్‌ను ప్రమాదంలో పడేసింది. పాలమూరు పేలుళ్లతో కల్వకుర్తి పంప్ హౌస్ మునిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్, అప్రోచ్ కెనాల్ పనుల్లో భాగంగా పేలుళ్ల కారణంగా కల్వకుర్తి పంపుహౌస్ గోడలకు పగుళ్లు వచ్చి మూడో మోటారు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.

కాంట్రాక్టర్ల డిజైన్ ప్రాజెక్టు ఇదే..

రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కొత్త చరిత్ర సృష్టించింది. కోట్లు ఖర్చు పెట్టి ఇంజినీర్లు ప్రతిపాదించినా.. అవన్నీ బుట్టదాఖలయ్యాయి. కేవలం కాంట్రాక్టర్ చేసిన డిజైన్ మాత్రమే కాగితాలెక్కింది. దీనిపై అప్పటి ప్రతిపక్షాలు, ఇరిగేషన్ అధికారులు మొత్తం వ్యతిరేకించారు. కానీ కాంట్రాక్టర్ సంస్థ డిజైన్ చేసిన దానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చి చరిత్రలో నిలిపింది.

ఈపీసీ లేదని ఎందుకిచ్చారు..?

‘‘ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులను ఎలా కట్టాలో కాంట్రాక్టర్లు ఎలా డిసైడ్ చేస్తారు. ఇంజినీర్లను కాదని కాంట్రాక్టర్లు డిజైన్ చేస్తే ఎలా అనుమతిస్తారు… అందుకే ఈపీసీని రద్దు చేస్తున్నాం..’’ అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఈపీసీ అమలు చేశారు. ఈ ప్రొక్యూర్‌మెంట్ పద్ధతి(ఈపీసీ) న అప్పటి కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చారు. వాస్తవంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఇంజినీర్ల డిజైన్‌ను పక్కనేశారు. ఇరిగేషన్ ఇంజినీర్లు ఈ డిజైన్‌ను నెలల తరబడి కష్టంచి తుది నివేదిక ఇచ్చారు. దీనిలో ఎక్కడా అండర్ గ్రౌండ్ కాల్వల పనులను ప్రతిపాదించ లేదు. దీనికి ప్రధాన కారణం కల్వకుర్తి పంప్ హౌస్. కల్వకుర్తి పంప్ హౌస్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలి పంప్ హౌస్ ఉంటుంది.

దీన్ని కచ్చితంగా ఉపరితల పంప్ హౌస్‌ను నిర్మించాలని ఇంజినీర్లు స్పష్టంగా చెప్పారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంప్ హౌస్‌లోని 4 మోటర్లకు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. డ్రిల్లింగ్‌తో పాటు బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుందని, దీంతో భూగర్భ కెనాల్ సాధ్యం కాదన్నారు. కానీ పనులు చేసే కాంట్రాక్ట్ సంస్థ ఈ డిజైన్‌ను మార్చింది. ఈపీసీ ప్రాతిపదికన డిజైన్లను ప్రభుత్వానికి ఇచ్చింది. దీనిలో మొదటి పంప్ హౌస్‌ను అండర్ గ్రౌండ్ కెనాల్‌ను చేయాలని ఈపీసీలో పేర్కొంది. దీన్ని నీటిపారుదల శాఖ మొత్తం వ్యతిరేకించింది. కానీ అప్పటి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థకే ప్రభుత్వం మొగ్గు చూపింది. దీనిపై ఆరోపణలు ఎదురవడంతో 2016లో ఇరిగేషన్ ఇంజినీర్లతో నిపుణుల కమిటీని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి తొలి పంప్ హౌస్‌లో అండర్ గ్రౌండ్ పనులు వద్దంటూ తేల్చింది.

మరేమైంది..!

అంతా చెప్పినట్టుగానే కల్వకుర్తి ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఈపీసీ పద్ధతిన అప్పగించిన పనులతో 2400 క్యూసెక్కులను ఎత్తిపోసే ప్రాజెక్టు ముగినిపోతోంది. శ్రీశైలం నుంచి నేరుగా నీళ్లు తీసుకునే రాష్ట్రంలోని ఏకైక ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పగిలిపోతోంది. 3.65 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టుకు గండం ఎదురైంది.

అంచనా పెరిగింది..

వాస్తవంగా పాలమూరు-రంగారెడ్డి తొలి పంప్ హౌస్ ఉపరితల నిర్మాణంతో ఇంజినీర్ల అంచనాతో పోలిస్తే భూగర్భ కెనాల్‌కు అంచనాలు పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు దాచి పెడుతూనే ఉన్నారు. దాదాపు రూ. 500 కోట్ల వరకు అంచనాలు పెరిగినట్లు చెప్పుతున్నారు. గతంలోనే దీనిపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇంజినీర్లపై చర్యలేవీ..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజినీర్లను ప్రభుత్వం తప్పిపట్టునట్టుగానే చేసింది. ఇంజినీర్ల డిజైన్‌ను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. కాంట్రాక్టర్ల డిజైన్‌ను మాత్రమే అప్రూవ్ చేశారు. డిజైన్ చేసిన ఇంజినీర్లు తప్పు చేసినట్లుగా భావించారు. అయితే డిజైన్లలోనే తప్పులు చేసిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇరిగేషన్ శాఖలో విమర్శలు వస్తూనే ఉన్నాయి.

రూ. 100 కోట్ల కోసమే డిజైన్ మార్చారు..:

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లలో కాంట్రాక్టర్ చేసిన డిజైన్లనే ఎందుకు అప్రూవ్ చేశారో రాష్ట్రమంతా తెలుసు. ఈ భూగర్భ కెనాల్ కోసం సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ. 100 కోట్లు ముట్టాయి. అప్పటి మంత్రి జూపల్లికి రూ. 50 కోట్లు ఇచ్చారు. ఈ మార్పుతో కాంట్రాక్టర్లకు రూ. 300 కోట్లు అదనంగా వచ్చాయి. దీనిపై 2017లోనే అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు. కనీసం స్పెషల్ డిస్కషన్ కూడా అవకాశం ఇవ్వలేదు. క్వశ్చన్ అవర్‌లో కూడా మాట్లాడే అవకాశం దక్కనీయకుండా చేశారు. ప్రాజెక్టుల పేరుమీద దోచుకుంటున్నట్లు మరోసారి రూఢీ అవుతోంది.

– చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి


Next Story

Most Viewed