వ్యాక్సిన్ పంపిణీలో గందరగోళం..

by  |
వ్యాక్సిన్ పంపిణీలో గందరగోళం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యాక్సిన్ పంపిణీలో ప్రభుత్వం స్థిరమైన నిర్ణయాలు ప్రకటించకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. గంటల వ్యవధిలోనే ఆకస్మికంగా నిర్ణయాలు ప్రకటించడంతో వ్యాక్సిన్‌ కోసం వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేసేందుకు నిరాకరించడంతో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం సెకండ్ డోసు వారికి మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్‌తో టీకాను పంపిణీ చేస్తున్నారు.

చివరకు హెల్త్ కేర్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ పంపిణీ నిరాకరించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 10 రోజుల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం పూటకో నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక అయోమయ స్థితిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలుపకపోవడంతో అటు అధికారులకు ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్‌ను సరఫరా చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్పష్టత లేని రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

వ్యాక్సినేషన్ పంపిణీ చేపట్టిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గుర్తుకు వచ్చింది. రోజుకు లక్షవరకు వ్యాక్సిన్లను అందించినప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా టీకా సెంటర్‌కు వెళ్లిన వారికి వ్యాక్సిన్‌ను అందించారు. కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18 – 44 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించడం, వ్యాక్సిన్ దిగుమతులు మందగించడంతో అస్మాత్తుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. మొదట 18 నుంచి 44 ఏళ్ల వారికి మాత్రమే పరిమితం చేసిన రిజిస్ట్రేషన్‌ను వ్యాక్సిన్ తీసుకునే వారందరికీ వర్తింప జేసారు. దీంతో లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యను గమనించిన ప్రభుత్వం వెంటనే 18ఏళ్ల పైబడిన వారికి నో వ్యాక్సిన్ అంటూ ప్రకటించారు.

45ఏళ్ల పైబడిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో సెకండ్ డోసు వారికి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నిబంధనలు విధించడంతో అసలు సమస్య మొదలైంది. సెకండ్ డోసు కోసం నేరుగా టీకా సెంటర్‌కు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్ నిబంధలను సూచించి వ్యాక్సిన్ వేసేందుకు నిరాకరించారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియను రద్దు చేసి కేవలం సెకండ్ డోసు వారికి మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా టీకాలను అందిస్తామని ప్రకటించారు.

టీకా సెంటర్ల దగ్గర ఆందోళనలు..

రిజిస్ట్రేషన్ ద్వారా టీకాలందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 45ఏళ్ల పైబడిన వారు టీకా కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. మొదటి డోసు కోసం టీకా సెంటర్లకు వెళ్లిన వారికి టీకాలు వేసేందుకు నిరాకరించడంతో వైద్య సిబ్బందితో లబ్దిదారులు ఆందోళనలకు దిగుతున్నారు, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ టీకాలు ఎందుకు ఇవ్వరని వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో నిర్ణయం ప్రకటించడంతో టీకా కోసం వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

హెల్త్ కేర్ వర్కర్లకు నో టీకా..

ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కరోనా విధులు నిర్వహిస్తున్న హెల్త్ కేర్ సిబ్బందికి కూడా టీకాలు అందడం లేదు. కేవలం సెకండ్ డోసు వారికి మాత్రమే టీకాలు పంపిణీ చేపడుతుటంతో హెల్త్ కేర్ వర్కర్లు కూడా టీకాలకు దూరమవుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభ దశలోనే కోవిన్ వెబ్‌సైట్‌లో హెల్త్ కేర్ వర్కర్ల వివరాలను ప్రభుత్వమే రిజిస్ట్రర్ చేసింది, అయినప్పటికీ ప్రస్తుతం టీకాలు వేసేందుకు అనుమతి లేదని టీకా సెంటర్ల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలంతా గందరగోళానికి గురవుతున్నారు.



Next Story