పాలకులకు కనువిప్పు కలిగేలా ఉపన్యాసం ఇచ్చిన పింఛన్ దారుడు

by  |
Pentions-1
X

దిశ, పటాన్‌చెరు: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పింఛన్ దారులకు కనీస పింఛను రూ.9 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వైకుంఠరావు డిమాండ్ చేశారు. టీఏపీఆర్పీఏ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్‌చెరులోని ఈపీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా 1995 నుంచి అమలులోకి వచ్చిన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పరిశ్రమల, ఇతర సంస్థల కార్మికులు, ఉద్యోగుల పెన్షన్ కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ఆ స్కీమ్ ను పెద్ద ఎత్తున వ్యతిరేకించిన తమకు రెండు సంవత్సరాల తరువాత ఈ స్కీమ్ పై సమీక్ష చేస్తామని అప్పటి కేంద్ర కార్మిక మంత్రి జి.వెంకటస్వామి హామీ ఇచ్చి 26 ఏళ్లు గడిచినా, అనేక ప్రభుత్వాలు మారినా ఈనాటికీ నెరవేరకపోవడం అన్యాయం అంటూ మండిపడ్డారు. ఈ స్కీమ్ ఫలితంగా దేశవ్యాప్తంగా 65 లక్షలమంది ఈపీఎస్ పెన్షనర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈ 26 ఏళ్లలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు అనేకసార్లు వేతన సవరణను చేశాయన్నారు.

రూ.300, 500 ఉన్న పెన్షన్ సుదీర్ఘ పోరాటాల వల్ల వెయ్యి రూపాయలు అయిందని అన్నారు. వెయ్యి రూపాయలతో ఎట్లా బతుకుతారో అన్న ఆలోచనే రాని పాలకులు వారి జీత భత్యాలను మాత్రం ఇష్టానుసారంగా పెంచుకుంటూ పెన్షనర్ల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్ర సంఘం, జాతీయ సంఘం ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలకు, కార్మిక మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సభ్యులకు ఎన్నో వినతి పత్రాలను ఇచ్చినా.. రాష్ట్ర రాజధానులలో, దేశ రాజధాని ఢిల్లీలో లెక్కలేనన్ని సార్లు ధర్నాలు, నిరాహార, నిరసన దీక్షలు చేసినా అనేక రాష్ట్రాల హైకోర్టులు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వాలలో చలనం లేకపోవడం నిర్లక్ష్య వైఖరిని, లెక్కలేనితనాన్ని వెల్లడిస్తున్నదని ఆయన అన్నారు. నెలకు రూ.9 వేలు కనీస పెన్షన్ ను, కరువు భత్యాన్ని, వైద్యం వంటి ఇతర‌ సదుపాయాలను సాధించేదాకా తమ పోరాటం కొనసాగుతదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్మ రాధాకృష్ణ, వెంకట్ రెడ్డి, రామారావు, ప్రభాకర్ రావు, దేవేందర్ చారి, మాధవరావు, సత్యవతి దేవి, సుశీల తదితరులు పాల్గొన్నారు.


Next Story