‘స్మిత్ x కోహ్లీ’.. ఎవరు నం.1?

by  |
‘స్మిత్ x కోహ్లీ’.. ఎవరు నం.1?
X

దిశ, వెబ్‌డెస్క్ : క్రీడారంగంలో మేటి ఆటగాళ్ల మధ్య పోలికనేది సర్వసాధారణం. ఇక క్రికెటర్ల మధ్య ఈ పోలిక ఒక్కోసారి తారాస్థాయిలో ఉంటుంది. ఎప్పుడూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకునే ఆటగాడు ఏదో ఒక సీజన్‌లో వెనకబడిపోవచ్చు. అదే సీజన్‌లో మరో ఆటగాడు విజృంభించవచ్చు. ఇలా గణాంకాలు, ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్లుగా కీర్తించబడుతున్న టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ర్టేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్‌ల అభిమానుల మధ్య ఇదేపోరు కొనసాగుతోంది.
2008లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన కోహ్లీ.. ప్రారంభంలో దూకుడు మనస్తత్వంతో విమర్శలు మూటగట్టుకున్నా ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి తనను తాను ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా మలచుకున్నాడు. అనతి కాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. వన్డేల్లో 59 బ్యాటింగ్ సగటుతో దాదాపు 11 వేల పరుగులు పూర్తిచేశాడు. ఇప్పటికే 43 సెంచరీలు సాధించి సచిన్ రికార్డు(49 సెంచరీలు)ను అధిగమించేందుకు ఎంతోదూరంలో లేడు. టెస్టుల్లోనూ 54 బ్యాటింగ్ సగటు, 27 సెంచరీలు, 7 వేల పైచిలుకు పరుగులు పూర్తిచేసుకున్నాడు.
2010లో లెగ్‌స్పిన్నర్‌గా ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్ క్రమంగా తన బ్యాటింగ్ స్కిల్స్‌తో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఓ దశలో కోహ్లీని దాటేస్తాడనుకుంటే ‘మ్యాచ్ ఫిక్సింగ్‌’ ఆరోపణలతో ఏడాదిపాటు ఆటకు దూరమవ్వడం ప్రతికూలంగా మారింది. పునరాగమనం తర్వాత కూడా టెస్టు్ల్లో 62.84 బ్యాటింగ్ సగటుతో కొనసాగుతూ కోహ్లీ కన్నా ముందున్నాడు. వన్డేల్లోనూ 42 సగటుతో పర్వాలేదనిపిస్తున్నాడు.
అయితే ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలం కావడం.. శుక్రవారం వెల్లింగ్‌టన్‌లో ప్రారంభమైన మొదటి టెస్టులోనూ 2 పరుగులకే వెనుదిరగడంతో నంబర్ వన్ ఎవరు అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ నం. 1 బ్యాట్స్‌మన్ స్మిత్ అంటూ ట్వీట్లతో హోరెత్తించారు. గత 19 ఇన్నింగ్సుల్లో కోహ్లీ ఒక్క సెంచరీ చేయకపోవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. 2011, 2014లోనూ కోహ్లీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కానీ, జూలు విదిల్చిన సింహంలా తిరిగి తన ఆటతోనే విమర్శకుల నోటికి తాళం వేయగలిగాడు. ఇప్పటి వైఫల్యం కూడా అలాంటిదే తప్ప మరోటి కాదనేది మరొకొంతమంది ఫ్యాన్స్ వాదన. కావాలంటే రికార్డులు చూసి మాట్లాడాలంటూ ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్ల తరఫున సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. రికార్డుల పరంగా చూసినా అదే నిజం. ఇప్పటికే కోహ్లీ టెస్టుల్లో 928 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంతో ఉన్నాడు.



Next Story

Most Viewed