అక్కడ గ‘లీజు’ దందా.. పట్టించుకోని పోలీసులు

by  |
Galeeju-Dhandha-1
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి: అక్కడ ఆధార్ కార్డు అవసరం లేదు.. ఎలాంటి వివరాలు లేకున్నా పరవాలేదు. బ్యాచిలర్‌లా .. కాదా అన్న అంశంతో సంబంధం లేదు. ఆన్​లైన్​లో ఒక్క క్లిక్​చేస్తే చాలు … ఏ ప్రాంతంలోనైనా రూమ్​బుక్ చేసుకోవచ్చు. చిందులా..విందులా..వినోదాల.. పక్క వారికి న్యూసెన్సా.. ఇవన్నీ జాన్తానై. హాయ్.. ఓయ్.. అయ్యో వంటి కంపెనీలు హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం గ‘లీజు’ దందా నడుపుతున్నాయి. హాయ్​..ఓయ్​అనే అంతర్జాతీయ కార్పొరేట్​కంపెనీల పేరిట నివాస గృహాలు కూడా పగలు హోటళ్లుగా మారుతున్నాయి. చీకటి పడితే బార్లుగా అవతారమెత్తుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. రాసలీలలకు కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తున్నాయి. ఆన్​లైన్​లో ‘అయ్యో’ అని క్లిక్ చేస్తే చాలు క్షణాలలో రూమ్ లు బుక్. అది నగరమైనా, పట్టణాలైనా, పల్లెలైనా ఎక్కడైనా ఛీప్​..డెడ్​ఛీప్​అంటూ గదులు బుక్​అవుతాయి. దానిని నీవు హోటల్​గా భావిస్తావా.. లేక లాడ్జీలుగా వాడుకుంటావా.. బార్​లుగా మలుచుకుంటావా? అది నీ ఇష్టం. నాలుగు గోడల మధ్య ఏమి చేసినా నిన్ను అడిగే వారుండరు. కావాల్సిన సరుకులు, సరంజామాలు అందుబాటులోకి వస్తాయి. మీ మీద ఈగ వాలకుండా ‘అయ్యో’ యాజమాన్యం చూసుకుంటుంది. సపర్యలు చేస్తుంది. కావాల్సింది కాసులు మాత్రమే. మీరు తాగి విందు చేసుకుంటున్నారా..లేక గదిలో తన్నుకుంటున్నారా గమనించే మనుషులుండరు. పసిగట్టేందుకు సీసీ కెమెరాలుండవు. ప్రధాన ద్వారం వద్ద మాత్రమే కెమెరాలుంటాయి. నివాస గృహాలను కమర్షియల్​దందాలకు ఉపయోగించినా కనీసం అనుమతి ఉన్నదా అని అడిగేవారు లేరు. ట్రేడ్​లైసెన్స్ ఉందా లేదా అని పరిశీలించడానికి జీహెచ్ఎంసీ అధికారులు భయపడుతున్నారు. ఆ కంపెనీ వెనుక ఏ శక్తులున్నాయో, దాని వ్యవహారాలు ఏమిటో మాకెందుకు అని ఒక జీహెచ్ఎంసీ అధికారి అభిప్రాయపడ్డారు.

పోలీసుల పర్యవేక్షణ అంతంతే..

రెండేండ్లుగా ఒక కార్పొరేట్ కంపెనీ హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో హోటల్, లాడ్జీల దందాకు దిగింది. ఆ కంపెనీ రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాలతోపాటు మారుమూల గ్రామాలలో సైతం ప్రైవేట్​భవనాలు, ఇండ్లను లీజుకు తీసుకుని ఒక బోర్డును తగిలిస్తుంది. ఒక్కో గదిలో చూడ చక్కని పడకలను ఏర్పాటుచేసి లైటింగ్‌తో చమక్కుమనిపించేలా సిద్ధం చేసి ఆన్​లైన్​లో తన వెబ్​సైట్​లో పోస్ట్​చేస్తుంది. అనుమతి పొందిన హోటళ్లు, లాడ్జీల కంటే తమ గదులు చాలా తక్కువ ధరకు లభిస్తాయని రేట్​చార్ట్​ను ప్రదర్శిస్తుంది. అందుకు చాలా మంది ప్రధానంగా బ్యాచిలర్లు, ప్రేమికులు, ఇతర చీకటి కార్యకలాపాలకు పాల్పడేవారు ముందుగా అకర్షితులవుతున్నారు. రాత్రికి రాత్రే వ్యక్తిగత గృహాలు కూడా లాడ్జీలు, హోటళ్లుగా మారుతున్నాయి. గల్లీలలో కూడా ఈ లీజు దందా నడుస్తున్నది. భారీ ఎత్తున నడుస్తున్న ఈ దందాను ప్రశ్నించే అధికారి లేడంటే ఆ కంపెనీ ఎంతగా ప్రభావితం చేస్తుందనేది అర్థం చేసుకోవచ్చు. కింది నుంచి పై దాకా ఆ కంపెనీ చైన్​లింక్​నడుపుతున్నది. వాస్తవానికి ఆ కంపెనీ ఎన్ని గదులకు అధికారిక అనుమతి పొందుతుంది.. ఎన్నింటిని అనుమతి లేకుండా నిర్వహిస్తున్నదనే లెక్క మున్సిపల్, పంచాయతీ అధికారుల వద్ద లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. హైదరాబాద్​లో జీహెచ్ఎంసీ అధికారులు ఆ కంపెనీ జోలికే వెళ్లడం లేదు. రెసిడెన్షియల్​భవనంలో కమర్షియల్​యాక్టివిటీని ప్రశ్నించడంలేదంటే ఆ కంపెనీ హవా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కంపెనీ కార్యకలాపాల సమాచారం పోలీసుల వద్ద కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో.

నేరాలకు స్థావరాలుగా మారుతున్న వైనం

వాస్తవానికి జంటలైనా… యువకులైనా.. ఎవరు గదులు తీసుకున్నా ప్రతీ ఒక్కరి ఆధార్​కార్డు, ఇతర వివరాలను తీసుకుంటారు. కానీ ఈ ‘అయ్యో’ గదులలో అవేమీ లేకున్నా పరవాలేదు. ఒక్కరికి ఆధార్ ఉంటే చాలు. మిగతా వారి వివరాలు లేకున్నా పరవాలేదన్నట్లు వ్యవహారాలు నడుస్తున్నాయి. వారు ఎందుకు గదులను రెంట్ కు తీసుకుంటున్నారు? క్రిమినల్​రికార్డు ఏమైనా ఉందా? ఇవన్నీ జాన్తానై. ఈ వెసులుబాటును యువతీ యువకులు, బ్యాచిలర్​లు అడ్వాంటేజీగా తీసుకుంటున్నారు. చాలాచోట్ల యువకులలో కొందరు మందు పార్టీల కోసం ‘అయ్యో’ను క్లిక్​ చేస్తున్నారు. డ్రంక్​అండ్​డ్రైవ్​సమస్య లేకుండా తెల్లార్లు జల్సా చేసి ఫ్రెండ్స్ ​ఇంటికి వెళ్లామంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు. తాగిన మత్తులో యువకులు ఘర్షణ పడిన సందర్బాలెన్నో ఉన్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఈ విషయాలు బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యానికి సహకరిస్తున్నట్లు బలమైన విమర్శలున్నాయి. శేరిలింగంపల్లి నల్లగండ్లలో తాజాగా జరిగిన హత్యతోపాటు ఎన్నో ఉదంతాలు ఇందుకు ప్రత్యక్ష తార్కాణాలు.

Next Story

Most Viewed