విద్యాసంస్థలు ఓపెన్.. విద్యార్థులకు అందని వ్యాక్సిన్

by  |
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాసంస్థల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆ మేరకు చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో 30 ప్లస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేపడుతుండటంతో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్ అందడంలేదు. జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18 నుంచి 44ఏళ్ల వారికి ఇప్పటి వరకు 32,81,729 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

జూలై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభం..

జూలై 1 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకున్నప్పటికి ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తరగతులు ప్రారంభానికి ముందే ఈ నెల 29 నాటికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రకటించారు.

డిగ్రీ, పీజీ విద్యార్థులకు అందని వ్యాక్సిన్..

ప్రభుత్వం నిర్వహించే వ్యాక్సినేషన్ సెంటర్లలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ అందించేందుకు టీకా సెంటర్ల నిర్వహకులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ కానందువల్ల విద్యార్థులకు టీకాలు అందించడం లేదు. తమకున్న ఆదేశాల ప్రకారం 30 ప్లస్ వారికి మాత్రమే టీకాలు పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. దీంతో టీకా సెంటర్లకు వెళ్లిన విద్యార్థులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ఆందోళన చెందుతున్న విద్యార్థులు..

వ్యాక్సిన్ తీసుకోకుండా తరగతులకు ఏ విధంగా హాజరుకావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తగరతి గదుల్లో భౌతిక దూరం పాటించినప్పటికి ఒకే గదిలో 30 నుంచి 40 మంది వరకు విద్యార్థులు ఉండే అవకాశముంది. ఈ క్రమంలో వైరస్ మళ్లీ విజృంభిస్తే సులువుగా కరోనా వ్యాప్తి జరుగుతుంది. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం ద్వారా కొవిడ్ నుంచి రక్షించడంతో పాటు విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపవచ్చు.

18 నుంచి 44ఏళ్ల వారికి 32,81,729 వ్యాక్సిన్ డోసుల పంపిణీ..

18 ప్లస్ వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు టీకా సెంటర్లలో మొత్తం 32,81,729 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్‌ను 32,57,437 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 24,292 మందికి అందించారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ సెంటర్‌లలో మొదటగా సూపర్ స్ర్పెడర్స్‌కు, తరువాత హైరిస్క్ గ్రూపు వారికి టీకాను అందించారు. ప్రస్తుతం 30 ప్లస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.

విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దు: ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు

డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్ అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తు్న్నది, 30 ప్లస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం వలన కళాశాల విద్యార్థులు వ్యాక్సిన్ పొందలేకపోతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేయకుండా తరగతులు ప్రారంభించి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూరైన తరువాతే కళాశాలల్లో తరగతులు ప్రారంభించాలి.

Next Story