పంతం పట్టిన మంత్రి.. బలైన కలెక్టర్!

by  |
పంతం పట్టిన మంత్రి.. బలైన కలెక్టర్!
X

దిశప్రతినిధి, మేడ్చల్ : ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం జిల్లా పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరువురు వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం మేడ్చల్ జిల్లా ప్రజానీకానికి శాపంగా పరిణమించింది. ఇది అధికార పార్టీ ప్రతిష్టకే కాకుండా జిల్లా పాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే విషయంపై మేడ్చల్ జిల్లాలో మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు మధ్య అధిపత్య పోరు నడిచింది. మంత్రి ఏ నిర్ణయాన్నైనా ప్రకటిస్తే కలెక్టర్ అందుకు విరుద్ధంగా వ్యవహారించేవారనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారమే కలెక్టర్ బదిలీకి కారణమై ఉండోచ్చనే చర్చ జిల్లాలో నడుస్తోంది.

పాలన అస్తవ్యస్తం..

జిల్లా ఆవిర్భావం తార్వత రెండో కలెక్టర్ గా నియమితులైన వెంకటేశ్వర్లు పాలన వ్యవహారాలపై సరైన పట్టు సాధించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రచార ఆర్బాటలకే అధిక ప్రాధాన్యం ఇచ్చాడని, కిందిస్థాయి ఉద్యోగుల పనితీరుపై పట్టనట్టు వ్యవహారించడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు దాయర రాంపల్లి గ్రామంలో భూ వివాద పరిష్కారానికి రూ.2కోట్లు డిమాండ్ చేసి, గత ఆగస్టు 14న రూ.కోటి పది లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ భూ వివాదంలో కీసర ఆర్డీవో రవి, కలెక్టర్(పేరును ప్రస్తవించకుండా) పాత్ర కూడా ఉన్నట్లు నాగరాజు ఏసీబీ విచారణలో వెల్లడించడం కలకలం రేపింది. అయితే ఈ కేసులో జైలులో ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజు అక్కడే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు ధర్మారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చి ఉరేసుకొని చనిపోయిన విషయం విదితమే. ఈ అవినీతి కేసులో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీనికి తోడు కలెక్టరేట్ లో పాలన వ్యవహారాలు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సీరియస్ గా లేకపోవడంతో ఏ అధికారి ఏప్పుడు ఆఫీస్ కు వస్తున్నాడో..? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ అండదండలతో మంత్రి మల్లారెడ్డి మాటను లెక్క చేయడం లేదని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

పంతం నీదా.. నాదా..

మంత్రి మల్లారెడ్డి మాటను కలెక్టర్ వాసం లెక్కచేయకపోవడంతో వీరి మధ్యన అధిపత్య పోరు తారస్థాయికి చేరింది. జవహర్ నగర్ లో సుధీర్ఘకాలంగా నివాసం ఉంటున్న దాదాపు 60వేల పేదల ఇళ్లను సీఎం అదేశాలతో 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేసేందుకు విద్యుత్ మీటర్లు, ఇంటి నెంబర్లను కేటాయించి, పన్ను వసూలు చేయాలని మంత్రి మున్సిపల్ అధికారులను ఆదేశిస్తే అందుకు కలెక్టర్ అడ్డుకోవడం, రైతు సమన్వయ సమితితో ఇద్దరు అర్హత లేని వ్యక్తులున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని మంత్రి సూచనను కలెక్టర్ లెక్క చేయకపోవడం, మేడ్చల్ లో మంత్రి సూచనతో వెలసిన నిర్మాణాలను కలెక్టర్ కావాలని కూల్చివేయడంతో మంత్రి, కలెక్టర్ ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. దీనికి తోడు మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక పత్రికలో వరస కథనాలు రావడం.. ఆ పత్రికలోనే కలెక్టర్ పనితీరు బేష్ గా ఉందని పొగడుతూ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

కలెక్టర్ తనపై కక్ష్య గట్టి కావాలనే ఇదంతా చేస్తున్నాడని భావించిన మంత్రి పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘జిల్లా నుంచి కలెక్టర్ నైనా బదిలీ చేయండి.. లేదా తన మంత్రి పదవినైనా తీసేయండి’ అని అప్పటి వరకు నిద్రహారాలు మానేస్తానని గట్టిగానే పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ నెల 13న జరిగిన కేబినెట్ లో ఇదే విషయాన్ని మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ను బదిలీచేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. దీనికి తోడు మేడ్చల్ జిల్లా నుంచి బదిలీ చేసిన వెంకటేశ్వర్లుకు మరో చోట పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన పంతాన్ని గట్టిగానే నెగ్గించుకున్నట్లు అయింది. అయితే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. జిల్లాకు మరో కలెక్టర్‌ను నియమించకపోవడంతో పాలన వ్యవహారాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.


Next Story

Most Viewed