రేపు కామారెడ్డికి సీఎం కేసీఆర్..

by  |
cm-kcr-20 1
X

దిశ, కామారెడ్డి : పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడేండ్ల కిందట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అవి పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. రేపు (ఆదివారం) సీఎం కేసీఆర్ వస్తున్న సందర్బంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే భవనాల పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా మిగిలిన చిన్నపాటి పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.

కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లో పనులు పూర్తయ్యాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్, మంత్రి ఛాంబర్లతో సహా సమావేశపు గది, ఇతర కార్యాలయాలకు ఫర్నిచర్ సమకూర్చారు. కార్యాలయ ఆవరణలో అందమైన గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్బంగా చుట్టూ రంగురంగుల జెండాలను ఏర్పాటు చేశారు. రహదారి వెంట టీఆర్ఎస్ జెండాలతో పాటు సీఎం కేసీఆర్ వచ్చే ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం సైతం ప్రారంభానికి సిద్ధమైంది. కార్యాలయం ఎదురుగా పరేడ్ గ్రౌండ్ నిర్మించారు. అదే గ్రౌండులో సీఎం కేసీఆర్ రాకకోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు.

జిల్లా పోలీసు, కలెక్టరేట్ కార్యాలయ దారిలో పచ్చదనం కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సీఎం వ్యక్తిగత సిబ్బంది కామారెడ్డికి చేరుకుని పర్యటన వివరాలు పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం నుంచి కలెక్టరేట్ వెళ్లే దారిని రెండు వరుసలుగా మారుస్తున్నారు. అందుకు సంబంధించిన పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్బంగా ఏర్పాట్లను కలెక్టర్ శరత్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.



Next Story

Most Viewed