దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

110
Jagan

దిశ, ఏపీ బ్యూరో: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుమల పర్యటనను ముగించుకున్న సీఎం వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య సీఎం వైఎస్‌ జగన్‌.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు, ఆలయ ఈవో భ్రమరాంబ తీర్థప్రసాదాలు అందజేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నానితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇకపోతే దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండడంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..